టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. ఎంపీ అవంతి గుడ్ బై!!

 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రావెల కిషోర్ బాబు, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ వంటి నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వారి బాటలోనే మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలవనున్నారు. ఇప్పటికే అవంతి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే అవంతి టీడీపీ నేతలకు టచ్ లో లేకుండా పోయారని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర టీడీపీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం.

అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతకాలం కిందట పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. అయితే భీమిలి నుంచి ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన మరోమారు తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యం లో అవంతి విశాఖ నార్త్‌ లేదా చోడవరం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. కానీ అధిష్ఠానం ఏ విషయం తేల్చకపోవడం, ఇదే సమయంలో వైసీపీ భీమిలి సీటు ఆఫర్‌ చేయడంతో అవంతి టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. జగన్ ను కలిసిన తర్వాత అవంతి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చెయ్యనున్నట్లు సమాచారం. ఈనెల 24న విశాఖపట్నంలో వైసీపీ సమర శంఖారావం నిర్వహించనుంది. ఆ సభలో జగన్ సమక్షంలో అవంతి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.