తెల్ల కాగితం- నల్ల చుక్క

‘‘ఇవాళ మీకో పరీక్ష పెట్టబోతున్నాను’’ క్లాసులోకి అడుగుపెడుతూనే చెప్పారు ప్రొఫెసర్‌. అకస్మాత్తుగా ఈ పరీక్ష ఏమిటా అని విద్యార్థులంతా తలపట్టుకుని కూర్చున్నారు. కానీ ప్రొఫెసర్‌ మాటని ఎవరు కాదనగలరు. ఎలాగొలా పరీక్షని పూర్తిచేసేందుకు అంతా సిద్ధపడ్డారు. అందరికీ తలా ఒక ప్రశ్నాపత్రాన్నీ ఇచ్చారు ప్రొఫెసర్‌. ‘‘ఈ ప్రశ్నాపత్రం వెనుకనే మీ జవాబులు రాసి ఇవ్వండి. మీకు ఒక్క అరగంటే సమయం ఉంది,’’ అంటూ పరీక్షని మొదలుపెట్టేశారు.

 

విద్యార్థులంతా ప్రశ్నాపత్రాలని తెరిచి చూస్తే ఏముంది. కాగితం మధ్యలో ఒక చిన్న చుక్క కనిపించింది అంతే! ప్రొఫెసర్‌గారు తమ తెలివితేటల్ని పరీక్షించేందుకే హఠాత్తుగా ఈ పరీక్షని పెట్టారన్న విషయం విద్యార్థులకి అర్థమైపోయింది. కాబట్టి అంతా ఆ చుక్కని చూసి తమకి తోచిన జవాబుని ఏదో ప్రశ్నాపత్రం వెనకాల రాయడం మొదలుపెట్టారు.

 

అరగంట గడిచిపోయింది, ఒకో విద్యార్థీ వచ్చి తను పూర్తిచేసి ప్రశ్నాపత్రాన్ని ప్రొఫెసర్‌గారి బల్లమీద ఉంచి వెళ్లారు. ప్రొఫెసరుగారు ఆ ప్రశ్నాపత్రాలన్నింటినీ తీసుకుని వాటిలోంచి ఒక్కో విద్యార్థీ రాసిన జవాబుని చదవడం మొదలుపెట్టారు. ప్రశ్నాపత్రంలో ఉన్న చుక్కని చూసి విద్యార్థులు రకరకాల జవాబులు రాశారు. కొంతమంది ఆ చుక్క ఆకారాన్నీ, రంగునీ వర్ణించారు. మరికొందరు కాగితంలో దాని స్థానం గురించి కొలతలు వేశారు. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి ‘జీవితం ఓ చుక్కలాంటిది...’ అంటూ కవితలల్లారు. కొందరైతే అసలు ఏ జవాబూ లేకుండా కాగితాన్ని అలాగే వదిలివేశారు.

 

ప్రశ్నాపత్రాలన్నింటినీ చదివిన తరువాత ప్రొఫెసరుగారు తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టారు- ‘‘మీకు ఓ నల్ల చుక్క ఉన్న పత్రాన్ని ఇచ్చి మీకు తోచింది రాయమని అడగ్గానే, అంతా కాగితం మధ్యలో ఉన్న నల్లని చుక్క గురించే రాశారు. ఎవ్వరూ కూడా మనం చెప్పుకునే సబ్జెక్టు గురించి కానీ, మీ లక్ష్యాల గురించి కానీ, జీవితం మీద మీకు ఉన్న అభిప్రాయాల గురించి కానీ... ఆఖరికి మీ గురించి కానీ ఒక్క ముక్క కూడా రాయలేదు. మన జీవితం కూడా మీకిచ్చిన తెల్లకాగితం లాంటిదే! దాని మీద అనారోగ్యం, పేదరికం, అసంతృప్తి, కుటుంబ కలహాలు లాంటి చిన్న చిన్న మరకలు కనిపిస్తూ ఉంటాయి. మనమంతా విలువైన జీవితాన్ని మర్చిపోయి ఎంతసేపూ ఆ మరకల మీదే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. వాటి గురించే మన మనసునీ కాలాన్నీ వెచ్చిస్తూ ఉంటాము. అంతేకానీ, చేతిలో ఉన్న తెల్లటి కాగితం మీద ఎంత అందమైన జవాబుని రాయవచ్చో, ఎంత అద్భుతమైన చిత్రాలని గీయవచ్చో మర్చిపోతూ ఉంటాము. నేను మీకు ఈ పరీక్ష పెట్టింది మీకు మార్కులు ఇవ్వడానికి కాదు, మీకు జీవితం విలువ నేర్పడానికి,’’ అంటూ ముగించారు ప్రొఫెసరుగారు.

ఆయన మాటలు విన్న తరువాత విద్యార్థులకి తమ జీవితాల్లో అత్యంత ఉపయోగపడే పాఠం అదే అనిపించింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara