చాన్సొచ్చిందా..? విసుగొచ్చిందా..?

మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాడనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అయినప్పటికీ సీనియర్లు మోత్కుపల్లి, రావుల, ఎల్ రమణ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వర్థంతి వేళ మోత్కుపల్లి నర్సింహులు అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

 

తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు.

 

ఎంతగా ప్రజల్లోకి వెళుతున్నా వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి తోడు.. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న గవర్నర్ గిరి ఇక దక్కే అవకాశం లేదు..? కనీసం రాజ్యసభకైనా పంపిస్తారా అన్న గ్యారెంటీ చంద్రబాబు నుంచి లేకపోవడంతో ఆయనలో కాస్త అసహనం పెరిగిందంటున్నారు. అందుకే తన దారి తాను చూసుకోవాలని మోత్కుపల్లి భావిస్తున్నారని.. దీనిలో భాగంగానే పార్టీ మారతానని చెప్పకుండా.. పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలంటూ కొత్తరాగం అందుకున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా నర్సింహులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాలేదు. అయితే నర్సింహులు నోటి వెంట విలీనం మాట రావడంతో తెర వెనుక ఏదో జరిగిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

టీఆర్ఎస్ నుంచి ఆఫరైనా వచ్చి ఉండాలని లేదంటే.. ఎంత కష్టపడినా పార్టీ బండి నడవటం కష్టమేనని భావించి ఆ మాటలు అన్నారా అంటూ శ్రేణుల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించాల్సి ఉంది.. ఉదయం అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఆయనకు పార్టీ నాయకులు మోత్కుపల్లి మ్యాటర్‌ను చెప్పారట. ఆ మాట విన్న వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే నర్సింహులు వంటి సీనియర్ నేతే విలీనం పాట పాడటం వల్ల పార్టీ పరిస్థితిపై శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని.. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓపెన్‌గానే అంటున్నారు. మరి నర్సింహులుపై అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.. శ్రేణులకు ఏం సమాధానం చెబుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.