అమ్మ వయసు రెండు లక్షల సంవత్సరాలు

 

ఎన్నో జన్మలెత్తితే కానీ మనిషిగా పుట్టడం సాధ్యం కాదు అంటాయి శాస్త్రాలు. అందులో వాస్తవాన్ని నిరూపించడం కష్టమే! కానీ ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత ఇప్పటి మనిషికి ఆ ఆకారం, జ్ఞానం వచ్చాయంటోంది విజ్ఞానశాస్త్రం. ఇప్పుడు ఆ చిక్కుముడి కూడా వీడిపోయింది. సరిగ్గా రెండు లక్షల సంవత్సరాల క్రితం తొలి మనిషి ఈ భూమ్మీద పుట్టాడని తేల్చారు.

 

అమెరికా, పోలండ్‌ దేశాలకు చెందిన పరిశోధకులు... మానవజాతికి తొలి మాతృమూర్తి ఎవరై ఉంటారా అన్న పరిశోధన మొదలుపెట్టారు. అందుకోసం ఇప్పటి మనిషిలోని జన్యువులని పరిశీలించసాగారు. తరం మారేకొద్దీ తల్లిదండ్రుల జన్యువులు కలిసి బిడ్డకు చేరుతూ ఉంటాయి. ఈ కలయికల వల్ల ఏ ఇద్దరి వ్యక్తులలోని జన్యువులూ ఒకేలా ఉండవు. ఇలా మారుతూ వస్తున్న జన్యువుల మూలాన్ని కనుక ఛేదించగలిగితే తొలి మానవుడు బయటపడినట్లే!

 

కానీ ఇదేమంత తేలికైన విషయం కాదు. ఒక మనిషిలో దాదాపు 20,000 రకాల జన్యువులు ఉంటాయి. వీటన్నింటిలో వస్తున్న మార్పుని పరిశీలించాలంటే మహా మహా కంప్యూటర్ల వల్ల కూడా కాదు. పైగా మిగతా జీవులతో పోలిస్తే మానవజాతి విశృంఖలంగా పెరిగిపోయింది. భూమ్మీద అతని సంచారమూ, వేర్వేరు తెగల మధ్య సంతానమూ పరిమితులు లేకుండా సాగాయి. శాస్త్రవేత్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే కానీ లెక్క తేలదు. అందుకని శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.

 

మనలో కేవలం తల్లి నుంచి మాత్రమే వచ్చే జన్యువు ఒకటి ఉంది. అదే mitochondrial Eve (mtEve). ఈ ఒక్క జన్యువునీ విశ్లేషిస్తే సరిపోతుందనుకున్నారు. రకరకాల mathematical models ద్వారా దీని వయసుని కనుగొనే ప్రయత్నం చేశారు. mitochondrial Eve (mtEve)లో మార్పు ఎన్నేళ్లకు ఓసారి వస్తోంది? అలా ఎన్ని మార్పులు వచ్చాయో అంచనా వేసి చిక్కుముడిని విప్పారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన రెండు లక్షల సంవత్సరాలు గడిచినట్లు తేల్చారు. అంటే రెండు లక్షల సంవత్సరాలుగా ఆడది, అమ్మ బాధ్యతను మోస్తూ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందన్నమాట!

- నిర్జర.