లాలిపాటలే తొలి జీవితపాఠాలు

 

బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లీ అనుకోదు. ఆ పిల్లవాడిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది, ఈ లోకానికి అందించేవరకూ ఆమె విశ్రమించదు. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ అద్భుతమే! అందుకే తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్టాపిక్! అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా పిల్లవాడి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది.

 

ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ పిల్లవాడిని తన పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు. ప్రపంచంలో బెస్ట్ సింగర్ తల్లే అని ఒప్పుకుంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లవాడి మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు. తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు.

 

లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లవాడిలో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు తల్లి వంకే చూస్తుంటాడు. పిల్లవాడి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతున్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తోందన్నమాట.

 

లాలిపాట పాడుతూ పిల్లవాడితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలామంది తల్లులు డెలివరీ తర్వాత, శరీరంలోని హార్మోనుల మార్పులతో డిప్రెషన్కు లోనవుతారు. దీన్నే postpartum depression అంటాము. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంభాలించుకుంటూ, పిల్లవాడికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట.

- నిర్జర.