చిక్కడు దొరకడు.. వెంటాడు వేటాడు 

అది బీజాపూర్ అడవి. ఆ అడవిలో జవాన్లు టెంట్లు వేసుకుని పాహారా కాస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్క సారిగా తుపాకీ తూటాల చప్పుడు. భద్రత బలగాలపై మావోయిస్టులు త్రిశూల వ్యూహంతో మెరుపుదాడి చేశారు. తుపాకుల మోతల మధ్య అడవిని పొగ కమ్మేసింది. ఆ పొగ తేలిపోగానే 22 మంది జవాన్లు రక్తపు మడుగులో కనిపించారు. మిగిలిన జవాన్లు ఆ దాడి నుండి తేరుకుని చూసే సరికి  కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌స కనిపించలేదు. ఏమైపోయారు అని జవాన్లు ఆలోచనలో పడ్డారు అక్కడ శవాలుగా పడిపోయిన జవాన్లను చూశారు అందులో కూడా రాకేశ్వర్ సింగ్ కనిపించలేదు.

జవాన్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉందని గ్రహించిన మావోయిస్టులు.. సేఫ్‌ జోన్‌కు వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అందుకు ఎవరో ఒక జవాన్‌ను బందీగా తమ వెంట తీసుకెళ్లడమే మంచిదని ‌భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్‌హా్‌సను అపహరించారు. అంతా అనుకున్నట్లే జరిగిందని భావించి, ఆపరేషన్‌ను ముగిద్దామని నిర్ణయించినట్లు తెలిసింది.  

కట్ చేస్తే .. ఆ గెరిల్లా దళ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఇప్పుడు సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయాడా? ఆ తర్వాతే మావోయిస్టుల నుంచి బందీగా ఉన్న జవాను విడుదలపై చర్చల ప్రస్తావన మొదలైందా? ఈ ప్రశ్నలకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. మూడో తేదీ సాయంత్రానికే వారు సేఫ్‌ జోన్లకు పయనమై.. కొందరు మావోయిస్టులను వ్యూహాత్మకంగా టేకులగూడెం వద్ద రాకేశ్వర్‌తోపాటు ఉంచారు. గెరిల్లా దళానికి చెందిన మావోయిస్టులు 10 బృందాలుగా బీజాపూర్‌, దంతెవాడ, సుక్మా అడవుల్లోని సేఫ్‌ జోన్లకు వెళ్లారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. హిడ్మా ఇప్పుడు ప్రభుత్వాలు, భద్రతా బలగాలకు టార్గెట్‌గా మారడంతో.. అతనికి నాలుగంచెల భద్రతను కల్పిస్తూ.. సేఫ్‌ జోన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఐదో తేదీకల్లా.. ఎక్కడివారక్కడ సేఫ్‌ అని నిర్ధారించుకున్నాక.. రాకేశ్వర్‌ సింగ్‌ తమ చెరలో ఉన్నాడని, మధ్యవర్తుల పేర్లు చెబితే వదిలేస్తామంటూ మావోయిస్టుల నుంచి లేఖ విడుదలైంది. అప్పటికీ పోలీసుల నుంచి కోబ్రా కమాండో కోసం గాలింపు చేపడుతున్నామని, కూంబింగ్‌ కొనసాగుతోందనే ప్రకటన రావడంతో.. వ్యూహాత్మకంగా రాకేశ్వర్‌ ఫొటోను విడుదల చేశారు. దీన్ని బట్టి.. ఆపరేషన్‌ జరిగాక కేవలం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లడానికే జవాన్‌ను అపహరించినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత చర్చల్లో భాగంగా జైళ్లలో మగ్గుతున్న తమ వారు 150 మందిని విడుదల చేయాలని, ఆపరేషన్‌ ప్రహార్‌ను నిలిపివేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాలని మావోయిస్టులు నిర్ణయించినా.. బస్తర్‌ విలేకరుల ఒత్తిడితో రాకేశ్వర్‌ను గురువారం విడుదల చేశారు.

ఇప్పుడు మావోయిస్టులపై ప్రతీకారానికి సీఆర్పీఎఫ్ సిద్దమవుతోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా హిడ్మాతో పాటు ఆయన దళం  కథ ముగిస్తామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్. 

ఈ ఆపరేషన్‌ కోసం బీజాపూర్  ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు  కుల్దీప్‌ సింగ్  తెలిపారు.  నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.  ఏడాదిలోగా హిడ్మా అంతు చూస్తామని హెచ్చరించారు. 

భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు.