సమ్మె ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి భారీ నష్టం!!

 

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచిపోనుంది. నేటితో సమ్మె 40 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కాలంలో సంస్థ దాదాపు రూ.400 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. సమ్మె మొదలై మంగళవారం నాటికి 39 రోజులు అవుతున్నా అటు ప్రభుత్వం కానీ ఇటు కార్మికులు కానీ పట్టువీడడం లేదు. రవాణా సదుపాయాల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 26 డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు.

1958 జనవరి 11 న ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన అనంతరం 2015 జూన్ 3 న టీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది. 2001 లో కార్మికులు 24 రోజులు సమ్మె చేశారు. ఆర్టీసీ చరిత్రలో అదే సుదీర్ఘ సమ్మె. 2005 లోనూ వేతనాల పెంపు కోసం జూలైలో 3 రోజులు, అక్టోబర్ లో 2 రోజులు కార్మికులు సమ్మె చేశారు. 2011 లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న దశలో సకల జనుల సమ్మె చేపట్టారు. అందులో ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 లో కార్మికులు వేతనాల పెంపు కోసం 8 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుత సుదీర్ఘ సమ్మెతో ఆర్టీసీ మరిన్ని నష్టాలను మూటగట్టుకుంటోంది. ఇప్పటికే 400 ల కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

సాధారణంగా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల మేరా టిక్కెట్ల ఆదాయం ఉంటుంది. కానీ తాత్కాలిక డ్రైవర్ లు కండక్టర్ లతో నడుస్తున్న బస్సులో రాబడి పెద్దగా ఉండటం లేదని అధికారులు అంటున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తమ సంస్థను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు కార్తీక పౌర్ణమి వేళ దేవుడికి పూజలు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన మహిళా కార్మికులు స్థానిక శివాలయం అమ్మవారి ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. వెంటనే తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చే విధంగా చూడాలని భగవంతుడిని కోరారు.