విలువ

ఒక యువకుడు తన జీవితంలో తరచూ ఎదుర్కొంటున్న సమస్యలతో విసిగిపోయాడు. నలుగురితో మంచిగా ఉండటం వల్లే తనకి అన్నేసి కష్టాలు వస్తున్నాయన్న అభిప్రాయానికి వచ్చేశాడు. అందుకే ఇక నుంచి ఎదుటివాడి సొమ్ముని దోచుకుని బతకాలని నిశ్చయించుకున్నాడు. తను సాగే ఈ మార్గం గురించి ఎప్పటికైనా తన తల్లికి తెలియక తప్పదు. అందుకనే ముందుగా ఈ విషయాన్ని తల్లి దగ్గర వెల్లడించాడు యువకుడు. అంతా విన్న తల్లి...

‘సరే! నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. ఫలానా పని చేయవద్దంటూ నేను చెప్పిన నువ్వు వింటావన్న నమ్మకం లేదు. నువ్వు నీ మొదటి దొంగతనానికి వెళ్లే ముందర ఓ వెండి నాణేన్ని నాకు ఇస్తావా’ అని అడిగింది తల్లి.

తన కొత్త జీవితానికి తల్లి అంత తేలికగా ఒప్పుకుంటుందని ఊహించలేదు యువకుడు. ‘ఓస్‌ వెండి నాణెమే కదా!’ అంటూ తన జేబులలో ఉన్న వెండిరూపాయిని తీసి తల్లి చేతిలో పెట్టాడు.

కొడుకు తన చేతిలో వెండి రూపాయిని ఉంచగానే, తల్లి దాన్ని కాలి కింద వేసి తొక్కింది. ఆ తరువాత ఆ నాణేన్ని నేలకేసి టపాటపా కొట్టడం మొదలుపెట్టింది. తల్లి చేసిన పని చూసి కొడుకు విస్తుపోయాడు.

‘నీకేమన్నా పిచ్చి పట్టిందా’ అని కోపంగా అడిగాడు కొడుకు.

‘అబ్బే అదేం లేదయ్యా!’ అంటూనే ఆ వెండి రూపాయిని దుమ్ములో వేసి ఆడించింది తల్లి.
తల్లి చేసే పనిని వింతగా చూస్తున్నాడు కొడుకు. నిజంగానే తన తల్లికి పిచ్చి పట్టి ఉంటుంది. లేకపోతే ఇలాంటి పని ఎందుకు చేస్తుంది?

తన వంక వింతగా చేస్తున్న కొడుకు వంక చిరునవ్వుతో చూస్తూ ‘బాబూ ఈ వెండి నాణెం నీకు ఇంకా కావాలా నాయనా!’ అంటూ అడిగింది తల్లి.

‘కావాలిగా మరి! ఎంత దుమ్ముకొట్టుకుపోయినా, గాట్లు పడినా వెండి రూపాయి విలువ తగ్గదు కదా!

’ అన్నాడు కొడుకు నాణేన్ని తల్లి చేతిలోంచి లాక్కొంటూ.

 

‘నీ వ్యక్తిత్వం కూడా ఈ వెండి నాణెంలాగానే ఉండాలిరా! కష్టాలు, సమస్యలతో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నీ విలువని కోల్పోకూడదు. ఆకలితో కడుపు మండుతున్నా, నీ వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు. మిగతా అందరిలాగానే నువ్వు కూడా ప్రత్యేకమైనవాడివే! నువ్వు కూడా విలువైన మనిషివే! ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విలువని కనుక ఓర్పుతో నిలుపుకోగలిగితే... ఏదో ఒక రోజున నీ కష్టాలు దాటిపోవడాన్ని గమనిస్తావు!’ అంటూ చెప్పుకొచ్చింది.

పిచ్చి చేష్టలుగా కనిపించిన తల్లి ప్రవర్తన వెనుక ఇంత అపురూపమైన సందేశం ఉందని తెలుసుకున్న కొడుకు, తన మనసుని మార్చుకున్నాడు.

- నిర్జర.