సెప్టెంబర్ 7 అర్ధరాత్రి.. ఆ 15 నిమిషాలే కీలకం.. చంద్రయాన్-2లో చివరి ఘట్టం

 

చందమామ రహస్యాలను అన్వేషించేందుకు ప్రయోగించిన చంద్రయాన్-2లో అసలుసిసలు కథ ఇప్పుడే ఆరంభమైంది. దాదాపు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్-2 అత్యంత కీలకమైన చివరి ఘట్టానికి చేరుకుంది. జాబిల్లిపై ల్యాండర్ దిగడమే మిగిలి ఉంది. ల్యాండర్ ల్యాండింగ్ కి ముందు జరగాల్సిన అత్యంత ముఖ్యమైన దశ ముగిసింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా వేరవడంతో.... ల్యాండర్లోని ప్రజ్ఞాన్‌ రోవర్‌... చంద్రమామ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం అప్రతిహాతంగా దూసుకుపోతోంది. ఆగస్ట్ 20న చంద్రుడి వలయంలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 కక్ష్యను ఇప్పటివరకు ఐదుసార్లు విజయవంతంగా తగ్గించారు. స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే పలు దఫాలుగా చంద్రుడి ఫొటోలను ఇస్రోకు పంపించింది. ప్రస్తుతం చంద్రుడికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. దాంతో చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది.

అయితే, చంద్రయాన్-2లో అత్యంత ముఖ్యమై చివరిదైన కీలక ఘట్టం సెప్టెంబర్ 7న ప్రారంభంకానుంది. ఏడున అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య చందమామ దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటికి వస్తుంది. పవర్ డీసెంట్ గా పిలిచే ఈ దశ 15 నిమిషాలపాటు సాగనుంది. ఈ 15 నిమిషాలనే ఇస్రో.... అత్యంత ఉత్కంఠభరిత క్షణాలుగా అభివర్ణిస్తోంది. ఈ సమయంలోనే చంద్రుడి రహస్యాలను రోవర్ ఇస్రోకు పంపుతుంది. దాంతో సెప్టెంబర్ ఏడున ఆవిష్కృతం కాబోయే అద్భుత ఘట్టం కోసం ఇస్రో ఆతృతగా ఎదురుచూస్తోంది. 

అయితే, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ల్యాండర్ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ నిర్దేశిత వేగాన్ని మించి ప్రయాణిస్తే క్రాష్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని, అయితే చంద్రయాన్-2లో ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోవడంతో... అంతా సవ్యంగానే జరుగుతుందని ఇస్రో ప్రకటించింది.