డబ్బు విలువ

అతను ఓ పెద్ద వ్యాపారి. తన కష్టానికి అదృష్టం కూడా కలిసిరావడంతో పట్టిందల్లా బంగారం అయ్యింది. దాంతో తన జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా పోయింది. అంతా బాగానే ఉంది. కానీ తన తర్వాత వ్యాపారం పరిస్థితి ఏమిటా అన్న బెంగ మొదలైంది వ్యాపారస్తునికి. ఎందుకంటే తన కొడుకు ఎలాంటి కష్టమూ తెలియకుండా పెరిగాడు. అతనికి వ్యాపార సూత్రాలు కానీ, డబ్బు విలువ కానీ ఏమాత్రం తెలియవు. కష్టపడే తత్వం ఇసుమంతైనా లేదు. అలాంటి కొడుక్కి బుద్ధి చెప్పడం ఎలా? అని తెగ ఆలోచించాడు వ్యాపారస్తుడు. ఆలోచించగా... ఆలోచించగా... అతనికి ఓ ఉపాయం తట్టింది.

మర్నాడు వ్యాపారస్తుడు తన కొడుకుని పిలిచాడు. ‘చూడు! నువ్వు ఎందుకూ పనికిరాకుండా పోతున్నావు. డబ్బు తగలెయ్యడం తప్ప సంపాదించడం చేతకావడం లేదు. అందుకని నీకో పరీక్ష పెడుతున్నాను. ఇవాళ నువ్వు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకుని వస్తేనే రాత్రికి భోజనం పెడతాను. లేకపోతే ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే!’ అని తేల్చి చెప్పాడు.

తండ్రి మాట విన్న కొడుకుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్లూ తనకి కష్టం అంటే ఏమిటో తెలియదు. అసలు కష్టపడాల్సిన అవసరం తనకేముందని? అందుకని బిక్కమొహం వేసుకుని తల్లి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు సమస్య విని తల్లి తల్లడిల్లిపోయింది. తన భర్త ఇంక కర్కశంగా ప్రవర్తిచాడేమిటా అనుకుంది. వెంటనే తన పెట్టెలోంచి ఒక బంగారు నాణెం తీసి కొడుకు చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది.

తల్లి ఇచ్చిన బంగారు నాణెం తీసుకుని కొడుకు సంతోషంగా తండ్రి దగ్గరకి వెళ్లాడు. ఆయన చేతిలో బంగారు నాణేన్ని ఉంచి, తనే ఆ నాణాన్ని సంపాదించానని చెప్పాడు. తండ్రి మహా తెలివైనవాడు. అందుకే ఆ నాణెం ఎక్కడి నుంచి వచ్చిందో చటుక్కున గ్రహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే నువ్వు సంపాదించుకుని రావాలి. అప్పుడే నీకు రేపు రాత్రి భోజనం దక్కుతుంది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ బంగారు నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు.

మర్నాడు కొడుకు నిద్రలేచేలోగా, భార్యని ఏదో పని మీద ఊళ్లోకి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో కొడుక్కి ఆ రోజు సంపాదన ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. వెంటనే తన అక్క దగ్గరకి వెళ్లాడు. తమ్ముడి కష్టం విన్న అక్క తెగ బాధపడిపోయింది. తండ్రి ఎందుకిలా తయారయ్యాడా అని తెగ మధనపడిపోయింది. వెంటనే తన పెట్టెలోంచి ఒక వెండి నాణెం తీసి తమ్ముడి చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది.

అక్క ఇచ్చిన వెండి నాణేన్ని తీసుకుని తమ్ముడు సంతోసంగా తండ్రి సముఖానికి చేరుకున్నాడు. ఆయన చేతిలో నాణేన్ని పెట్టి తానే దానిని సంపాదించానని చెప్పాడు. తండ్రి తక్కువవాడా! ఆ నాణెం ఎక్కడిదో ఊహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే సంపాదించుకుని రా! అప్పుడే నీకు రేపు రాత్రి తిండి పెట్టేది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ వెండి నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు.

మర్నాడు కొడుకు నిద్రలేచేసరికి భార్యనీ, కూతురినీ చుట్టాలింటికి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో ఇక కొడుక్క అసలు సమస్య మొదలైంది. బంధువులని డబ్బు అడిగితే తండ్రికి తెలిసిపోతుంది. తెలిసినవారిని అడగాలంటే మొహమాటం అడ్డు వచ్చింది. దాంతో ఎలాగొలా ఆ ఒక్కరోజూ కష్టపడదామని నిర్ణయించుకున్నాడు. ఆ కొట్టూ ఈ కొట్టూ తిరుగుతూ పనికోసం ప్రాథేయపడ్డాడు. కొంతమంది లేదన్నారు. కొంతమంది ఛీత్కరించారు. కొంతమంది తరిమికొట్టారు. పాపం ఇలాంటి అనుభవాలన్నీ అతనికి కొత్త. మరోవైపు కడుపు నకనకలాడిపోతోంది.

చివరికి మధ్యాహ్నం ఎప్పటికో ఓ పుణ్యాత్ముడు అతనికి పని ఇచ్చాడు. కొట్టు బయట ఉన్న కట్టెలన్నీ తీసి లోపల పడేస్తే ఓ పదిరూపాయలు ఇస్తానన్నాడు. ఆ మాట వినగానే కొడుకు మొహం వెలిగిపోయింది. కానీ ఒకో కట్టెముక్కా తీసుకుని లోపలకి వేస్తుంటే అతని ఒళ్లు హూనమైపోయింది. వీపు దోక్కుపోయింది. చేతులు పుళ్లుపడిపోయాయి. చివరికి ఎలాగోలా తనకి అప్పచెప్పిన పనిని పూర్తిచేశాడు. పదిరూపాయల నాణెం తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు.

కొడుకు వాలకం చూడగానే తండ్రికి విషయం అర్థమైపోయింది. అయినా అతను చెప్పాలనుకున్న పాఠం ఇంకా పూర్తికాలేదు. అందుకనే- ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి,’ అని చెప్పాడు. ఆ మాట వినగానే కొడుకు మనసు తరుక్కుపోయింది. ‘ఇంతా కష్టపడి సంపాదించిన డబ్బుని బావిలో పడెయ్యాలా! వద్దు నాన్నా!’ అని వేడుకున్నాడు.

ఆ మాటలకి తండ్రి చిరునవ్వుతో- ‘చూశావా! ఎవరో ఇచ్చిన సంపద- అది బంగారమైనా, వెండైనా సరే... దాని విలువ మనకి తెలియదు. అందుకే బావిలో పారేసినట్లుగానే ఖర్చు చేసి పారేస్తాం. అదే రక్తం ధారపోసి సంపాదించినది రూపాయి అయినా సరే... దానిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటాం. ఈ రోజుతో నీకు డబ్బు విలువ తెలిసొచ్చింది. ఇక మీదట నువ్వు నా వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండు,’ అని చెప్పాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.