కులంపై కొందరు, కులం అడ్డు పెట్టుకుని కొందరు..

కులం… భారతదేశంలో ఇదో బ్రహ్మపదార్థం! ఎవరికి నచ్చినట్టు వారు అర్థం చేసుకుంటారు! కొందరు కులమే అన్ని సమస్యలకి కారణం అంటే… కొందరు కులం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే వారి వల్లే అశాంతి అంటారు. ఏది ఏమైనా కులం గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు రాసినా, ఎవరు చదివినా భావోద్వేగాలు చెలరేగటం మాత్రం సర్వ సాధారణం.

 

 

వేలాది ఏళ్ల కుల వ్యవస్థ ఒక్కసారిగా పోదనేది నిజం. కానీ, మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చీ, రాజ్యాంగం రాసుకుని, కుల వివక్ష నేరమని నిర్ణయించుకున్నాక కూడా కులం పోయిందా? లేదు! కనీసం బలహీనపడిందా? అదీ అనుమానమే! చాలా సందర్భాల్లో కులం గతం కంటే చాలా బలహీనమైందని మనకు అనిపిస్తూ వుంటుంది. గతంలో లాగా ఇప్పుడు గుళ్లలోకి దళితుల్ని రానీయకపోవటం, అంటరానితనం, ఇతర వెనుక బడిన కులాల వార్ని కూడా అనేక పద్ధతుల్లో అవమానించటం, దోపీడి చేయటం బాగా తగ్గింది. కానీ, అదే సమయంలో కులం చుట్టూ కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. విచిత్రంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ప్రాముఖ్యత మీడియాలో ఇప్పుడు కులం పొందుతోంది! అదే ఆందోళనకరం!

 

 

ఈ మధ్యే… క్రికెటర్ గా మనందరికీ తెలిసిన మహ్మద్ కైఫ్ ఓ న్యూస్ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. ట్విట్టర్ లో ది వైర్ అనే వెబ్ సైట్ వారు ప్రచురించిన ఆర్టికల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంతకీ, మహ్మద్ కైఫ్ కు కోపం తెప్పించిన ఆ వ్యాసం దేని గురించి అంటే… భారత క్రికెట్ లో ఎస్టీ, ఎస్టీల సంఖ్య సరైన నిష్పత్తిలో లేదని! ది వైర్ వారి ఉద్దేశం ప్రకారం… 86 ఏళ్ళ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురే ఎస్సీ, ఎస్టీ క్రీడాకారులున్నారు. జనాభా లెక్కల ప్రకారం చూస్తే వారు 70 మంది దాకా వుండాలి. కానీ, దళితులకి, గిరిజనులకి ఇండియన్ క్రికెట్ లో అవకాశాలు రావటం లేదని వ్యాస కర్త ఆరోపణ! మహ్మద్ కైఫ్ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఇండియాలో కుల వివక్ష లేని అతి కొద్ది రంగాల్లో క్రికెట్ ఒకటని, అనవసర విశ్లేషణలు చేసి దాని పేరు చెడగొట్టవద్దని కైఫ్ అన్నాడు. అతడికి నెటిజన్స్ నుంచీ మద్దతు కూడా బాగానే వచ్చింది.

క్రికెట్ కాస్త డబ్బున్న వాళ్ల ఆట. కాటట్టి అందులో ఎలాగూ దళితులు, గిరిజనులు తక్కువే వుంటారు. వారే కాదు బీసీలతో సహా చాలా వర్గాలు ఇండియన్ క్రికెట్లో తక్కువగా ప్రాతినిధ్యం కలిగి వున్నాయి. అందుకు వివక్ష కొంత కారణం కావచ్చేమోగాని… అంతకంటే ఎక్కువగా క్రికెట్ ఆడే ఆర్దిక స్థోమత కేవలం కొన్ని వర్గాలకే వుండటం ప్రధాన కారణం. ఇంత చిన్న విషయం ది వైర్ అనే మీడియా సంస్థకి తెలియదా? తెలిసినా ఈ మధ్య అనేక పేపర్లు, ఛానళ్లు, వెబ్ సైట్లు కులం మీద చర్చోపచర్చలు నడిపి జనాన్ని ఎమోషనల్ చేసి పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ మధ్య కంచ ఐలయ్య వర్సెస్ వైశ్యుల వివాదంలో మన మీడియా అత్యుత్సాహం మనం మరిచిపోగలమా?

 

 

ది వైర్ లాంటి పేరున్న మీడియా సంస్థలు క్రికెట్ లో కులం అంటూ చిన్న సమస్యని భూతద్దంలో చూపిస్తుంటే… అసలు కులం ప్రభావం మరికొన్ని చిన్న వార్తలు చూస్తే మనకు తెలిసిపోతుంది. రాజస్థాన్ లోని ఓ గ్రామంలో తండ్రి చివరి కోరికగా తన నలుగురు కుమార్తెల్నే తలకొరివి పెట్టమన్నాడు. ఆయనకు కొడుకులు లేకపోవటంతో అమ్మాయిలే ఆ పని చేయాల్సి వచ్చింది. కానీ, కూతుర్లు చితికి నిప్పు పెట్టడం కుల పెద్దలకు నచ్చలేదట. తండ్రి లేని ఆ నలుగురు కూతుళ్లకి రాజస్థాన్ లోని ఆ గ్రామపు ఖాప్ పంచాయితీ పెద్దలు బహిష్కరణ విధించారు. విషాదం చోటు చేసుకున్న వారింటికి ఎవరూ భోజనం పంపటం లాంటి కనీస సహాయం కూడా చేయలేదట. సాటి కులస్థులు వచ్చి ఓదార్చాల్సింది పోయి మరింత దాష్టీకం ప్రదర్శించారు!

ఎక్కడో రాజస్థాన్ లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కులం ఎప్పుడూ కలకలమే! ఒక వైపు రాజకీయ నేతలు కుల రిజర్వేషన్లు అంటూ పబ్బం గడుపుకుంటూ వుంటే… మరో వైపు సిద్ధిపేటలోని ఓ గ్రామంలో చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందని అన్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టానుసారం పొడిచి పారిపోయాడు. ఆమె చావు బతుకుల మధ్య వుంది. కులం అసలు సిసలు ప్రభావం ఇది!

 

 

క్రికెట్ లో ఏ కులం వారున్నారు, లేరు అన్న దాని కన్నా ముందు పోరాడాల్సింది … సాటి మనుషుల్ని, స్వంత కుటుంబీకుల్నే చంపుకునే కులోన్మాదంపైన! కానీ, మన మీడియా రాను రాను సంచలనాల మీదే దృష్టి ఎక్కువగా పెడుతోంది. కులం పేరుతో ఎంత రచ్చైతే అంత టీఆర్పీ అన్నట్టుగా కథ నడిపి లాభం పొందుతోంది. అందుకు తగ్గట్టే కొందరు మేధావులు, ఉద్యమకారులు కొంత వర్గం స్వార్థ మీడియాతో చేతులు కలుపుతున్నారు. కులం ప్రాతిపదికన ఎంత అసహనం, అశాంతి రేగినా వీరు తమ పని తాము చేసుకుపోతుంటారు. అలాగని నిజమైన కుల వివక్షకు లోనవుతున్న వారికి వీరి ఉద్యమాలు, చర్చలు, వ్యాసాంగాల వల్ల లాభం అంటే… చాలా స్వల్పమనే చెప్పాలి!

స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైన ఈ తరుణంలో మనం కులంపై పెద్ద పెద్ద విజయాలే సాధించాం. ఇంకాస్త నిజాయితీ వుంటే ఇంకా త్వరగా పూర్తి గెలుపు సాధిస్తాం. కానీ, అంత వరకూ జనం స్వార్థ రాజకీయ నేతలు, మీడియా ట్రాప్ లో పడకుండా… కులంపై నిజంగా పోరాటం చేస్తున్న వారి వెంట నడవాలి!