అజ్జు భాయ్‌ని సికింద్రాబాద్ పిచ్‌పై స్వంత పార్టీ నేతలే రనవుట్ చేస్తారా?

అజహరుద్దీన్… ఈ పేరు వినగానే మనకు ఇప్పటికీ క్రికెట్టే గుర్తుకు వస్తుంది. అలాంటి మంచి ట్రాక్ రికార్డ్ వున్న క్రికెటర్ అండ్ కెప్టెన్ ఆయన. కానీ, ఇప్పుడు అజహరుద్దీన్ క్రికెటర్ కాదు. పొలిటీషన్. అసలు ఆయన అలా ప్రవర్తిచింది ఎప్పుడూ లేదు. పోయిన ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిచి ఈ అయిదళ్ల కాలంలో దాదాపు స్థబ్దుగా వుండిపోయారు. చాలా మంది సినీ, క్రికెట్ ప్రముఖల్లాగే కాంగ్రెస్ కు ఓ ఎంపీ సీటు సంపాదించి పెట్టి తన పని తాను చేసుకుంటూ వుండిపోయాడు. పార్లమెంట్లో , బయటా ఎక్కడా అజహరుద్దీన్ రాజకీయ వ్యాఖ్యలు చేసిందీ లేదు, రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించింది కూడా లేదు! కాకపోతే, తాజాగా ఆయన చేసిన ఒక చిన్న కామెంట్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. అదీ తెలంగాణ , హైద్రాబాద్ కాంగ్రెస్ లలో!

 

 

2014లో ఉత్తరాదిన పోటి చేసిన అజహరుద్దీన్ ఈసారి స్వంత రాష్ట్రం తెలంగాణ నుంచీ పోటీకి రెడీ అయ్యాడు.అయితే, చాలా రోజులుగా ఆయన హైద్రాబాద్ ఎంపీ స్థానానికి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తారని టాక్ వినిపించింది. దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఓవైసీకి అజహరుద్దీన్ సరైన పోటీ అని భావించిందట. కారణం… ముస్లిమ్ జనాభా ఎక్కువ వుండే హైద్రాబాద్ లో ఓవైసీకి పెద్దగా పోటీనే లేదు ప్రస్తుతం. అతడిపై విమర్శలు చేయటం కూడా బీజేపీ వారు చేయాల్సిందే తప్ప ఇతర పార్టీలు ఓవైసీల ఎంఐఎం ప్రాపకం కోసం పాకులాడుతూనే వుంటాయి. టీఆర్ఎస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానీ ఎప్పుడూ ఓవైసీల్ని టార్గెట్ చేసింది లేదు. కానీ, గత ఎన్నికల్లో మోదీ తుఫాన్ కారణంగా కాంగ్రెస్ 44 సీట్లకు దిగజారింది. తమకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఓటు బ్యాంక్ గా వున్న ముస్లిమ్ లు కూడా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అందుకే, రాహుల్ టీమ్ ముస్లిమ్ జనాభా ఎక్కువగా వుండే నియోజక వర్గాలపై దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెడుతోంది ఈ సారి.

 

 

హైద్రాబాద్ లోని ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను అజహరుద్దీన్ తిరిగి తమ ఖాతాలోకి తెస్తాడని కాంగ్రెస్ హై కమాండ్ భావించి వుండవచ్చు. కానీ, ఓవైసీపై పోటీ చేస్తే తాను తప్పక ఓడిపోతానని అజహరుద్దీన్ కు బాగా తెలుసు. ఎంఐఎం అధినేతకు అలాంటి పట్టు నియోజకవర్గంపై వుంది. అంతే కాక అజహరుద్దీన్ కు అసదుద్దీన్ తో వున్న బంధం కూడా పోటీకి వెనుకంజ వేసేలా చేసి వుండవచ్చు. ఇవన్నిటి కారణంగా అజహరుద్దీన్ సికింద్రాబాద్ బాంబు పేల్చాడు!

 

 

హైద్రాబాద్ అంత ముస్లిమ్ జనాభా లేనప్పటికీ సికింద్రాబాద్ లో కూడా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిమ్ ఓటర్లు మెజార్టీగా వున్నారు. అందుకే, అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచీ పోటీ చేస్తానని తన అభిప్రాయం బయటపెట్టారు. ఇది వరుసగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ వస్తోన్న అంజన్ కుమార్ యాదవ్ కి నచ్చలేదు. 2014లో ఓడినప్పటికీ 2004, 2009 ఎన్నికల్లో ఆయన మంచి మెజార్టీతోనే గెలిచారు. 2019లో బీజేపీ దత్తాత్రేయ నెగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు మంచి పట్టున్న నియోజక వర్గం వదలటానికి అంజన్ ఏ మాత్రం సిద్దంగా లేరు. అంతే కాదు, అజహరుద్దీన్ కి మతం కలిసి వస్తే అంజన్ కు కులం కలిసి వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించాలి. పైగా కాంగ్రెస్ అజహరుద్దీన్ లాంటి ముస్లిమ్ అభ్యర్థిని పోటీకి పెడితే అది బీజేపీకి ఆటోమేటిక్ గా కలిసొచ్చే అంశం. అజహరుద్దీన్ పై బహిరంగంగా బీజేపీ మతపరమైన కామెంట్లు చేయకపోయినా… బూతు లెవల్లో ఓటర్లను హిందూత్వ భావజాలంతో ప్రభావితం చేయగలదు. అలా కాంగ్రెస్ కు సికింద్రాబాద్ నియోజక వర్గం మొత్తానికి పోయే ప్రమాదం వుంది. లోకల్ నేతైన అంజన్ కుమార్ నే బరిలోకి దించటం ఎంతైనా తెలివైన పని అంటున్నారు రాజకీయ పండితులు!

 

 

రాహుల్ గాంధీ నిజంగా ముస్లిమ్ లకు దగ్గరవ్వాలనుకుంటే అజహరుద్దీన్ ను ఓవైసీ పైన పోటికి ఒప్పించటమే తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే, ఎన్నిసార్లు గెలిచినా హైద్రాబాద్ ముస్లిమ్ ల సమస్యలపై ఓవైసీలు పెద్దగా చేసిందేం లేదు. ఆ విషయాన్ని ఓటర్లుకు అజహరుద్దీన్ చేత చెప్పిస్తే కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించుకోవచ్చు. అలాగే, అసదుద్దీన్ బీజేపీతో పాటూ కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దగ్గరగా మసులుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయనేం కాంగ్రెస్ కు మద్దతు పలకటం లేదు. కాబట్టి ఓవైసీలపై అజహరుద్దీన్ చేత పోరు చేయించి హైద్రాబాద్ వశం చేసుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. లేదంటే సికింద్రాబాద్ నియోజక వర్గంలో లేనిపోని గందరగోళంతో అంజన్ కుమార్ లాంటి మాస్ లీడర్ ని కూడా ఏ బీజేపీకో, టీఆర్ఎస్ కో కోల్పోవాల్సి రావచ్చు!