మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు..?

 

చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ.

సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది.

సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు.

పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.