చంద్రబాబుకు మోదీ మార్క్ దెబ్బ!!

 

కేంద్రంలో అఖండ మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు తమ శత్రువైన చంద్రబాబుని టార్గెట్ చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం చేసిన చంద్రబాబుకు తమ దెబ్బ రుచి చూపిస్తున్నారు. అటు కేంద్రంలో మోదీ, ఇటు ఏపీలో వైపీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు ముందుగానే ఊహించారు. అయితే ఇంత త్వ‌ర‌గా బీజేపీ ఆప‌రేష‌న్ మొద‌లు పెడుతుంద‌ని, చంద్ర‌బాబును ఇంత త్వ‌ర‌గా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌న‌ను అవ‌మానించిన చంద్రబాబును అదే స్థాయిలో మోదీ ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో మోదీ, చంద్రబాబు మిత్రులు. ప్ర‌త్యేక హోదా పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీడీపీ బ‌యటకు వచ్చి ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఏపీకి మోదీ, అమిత్ షా వ‌చ్చిన స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించాయి. ఏపీకి మోదీని శ‌త్రువుగా క్రియేట్ చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. అదే మోదీకి ఆగ్ర‌హం తెప్పించింది. ఏపీలో తాను తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం నాడు చంద్ర‌బాబు మోదీని ప్ర‌ధాన ముద్దాయిగా చూపించి, మోదీని తాను మాత్ర‌మే ఎద‌ర్కోగ‌ల‌న‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొన్నారు. మోదీ ఏపీకి ఏమీ చేయ‌లేద‌ని, మోదీని ఏపీలో విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, మోదీని ప‌దేప‌దే త‌న‌కంటే జూనియ‌ర్ అనీ, గోద్రా అల్లర్లలో మోదీ రాక్ష‌సంగా వేలాది మంది మైనారిటీలను చంపించార‌ని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. గోద్రా కేసులో మోదీని అరెస్ట్ చేయాల‌ని తొలుత డిమాండ్ చేసింది తానే అంటూ చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. మోదీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

చంద్ర‌బాబుని మోదీ ఈ స్థాయిలో టార్గెట్ చేయటానికి కార‌ణం ఆయన మోదీపైన చేసిన వ్య‌క్తిగ‌త ఆరోపణలే కారణం అని సమాచారం. ఏపీలో టీడీపీ లేకుండా చేట‌య‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు మోదీ, అమిత్ షా ప‌ని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డ సన్నిహిత పారిశ్రామికవేత్తలు - టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లతోపాటు మరో ఇద్దరు ఎంపీలు గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. వీరు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడి కి లేఖ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.

రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. మరి ఈ సంక్షోభ స‌మ‌మంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచేదెవరో వేచి చూడాలి!!