తెదేపా సువర్ణావకాశం చేజార్చుకొందా?

 

నిన్నఅహ్మదాబాద్ లో ఘనంగాజరిగిన నరేంద్రమోడీ ప్రమాణస్వీకార సభకి బాలయ్యబాబుని వెళ్ళనీయకుండా అడ్డుపడి తెలుగుదేశంపార్టీ ఒకసువర్ణావకాశాన్ని చేజేతులావదులుకొందా అనే అనుమానం ఆపార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

 

గుజరాత్ ఎన్నికలలో వరుసగా మూడవసారి విజయం సాదించిన నరేంద్రమోడీ రానున్నఎన్నికలలో భారతీయపార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నేపద్యంలో, అతని ఆహ్వానం మన్నించి దేశం నలుమూలలనుండీ వచ్చిన అతిరధ,మహారధులు నిన్నఆయన సభకు హాజరవడం ద్వారా ఆయనతో, అయన ప్రాతినిద్యం వహిస్తున్నభారతీయపార్టీతో రానున్న ఎన్నికలలో చేతులు కలిపి పనిచేసేందుకు సముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

 

ప్రస్తుత పరిస్తితిలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారం కోరుకొనే ప్రతీ ప్రాంతీయ రాజకీయపార్టీ కూడా, కాంగ్రేసుతో కలవడమో లేక దానికి ప్రత్యమ్నాయం కోసం చూడకతప్పని పరిస్తితి. కాంగ్రేసును వ్యతిరేకిస్తున్నవారు, కాంగ్రేసుపార్టీకి జాతీయస్థాయిలో ఏకైక ప్రత్యమ్నాయంగా నిలిచిన భారతీయపార్టీనే ఆశ్రయించక తప్పని పరిస్తితుల్లో, నిన్న మోడీ సభలో పాల్గొని నరేంద్రమోడీ చాచిన స్నేహహస్తం అందుకొనే ప్రయత్నం చేసారు.

 

గతంలో, యన్.డి.యే. కు మద్దతు ప్రకటించి భారతీయపార్టీకి పరోక్షంగా కలిసి పనిచేసిన తెలుగుదేశంపార్టీ, నేడుకూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. అటువంటప్పుడు, మోడీ సభకి బాలయ్యను కనీసం వ్యక్తిగత హోదాలోనయినా పాల్గొననీయకుండా చేసి ఒక సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకోందని ఆపార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

 

ఒకవేళ, మోడీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని వై.యాస్సార్.కాంగ్రెస్ పార్టీ గానీ, తెరాసగానీ అందుకొంటే అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ పరిస్తితి చాలా దారుణంగా మారవచ్చును. కాంగ్రెస్ పార్టీ వల్లనే జైలు జీవితం గడువలసి వస్తోందని ఆవేదన చెందుతున్న జగన్ మోహన్ రెడ్డి, తన విడుదలకు భారతీయజనతా పార్టీ గానీ ఏమాత్రమయినా ఉపయోగపడగలదని నమ్మినట్లయితే అతను తప్పకుండా ఆపార్టీ చేయందుకోవచ్చును. అతని ప్రస్తుత పరిస్తితిపట్ల సానుభూతి చూపుతున్న క్రిస్టియన్ మరియు రెడ్డి వర్గాలకు చెందినవారు కూడా, అతను భారతీయజనతా పార్టీతో చేతులుకలిపినా, దానిని అతను ఆఊబిలోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నంగా అర్ధంచేసుకొని అతనికే తమ మద్దతు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.

 

ఇక, కేవలం భారతీయజనతాపార్టీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ స్పష్టంగా ప్రకటించిన నేపద్యంలో, కాంగ్రేసు పార్టీ తెలంగాణా విషయంలో అనుసరిస్తున్న సాచివేత వైఖరితో విసిగెత్తిపోయున్నతెరాస రాష్ట్ర సాధనకోసం భారతీయజనతాపార్టీతో ఎన్నికలపొత్తులకు సిద్దమయినా ఆశ్చర్య పోనవసరం లేదు.

 

ఒకవేళ, ఈ రెండు పార్టీలతో భారతీయజనతాపార్టీ గానీ సంబందాలు కలుపుకోగాలిగితే, అప్పుడు రాష్ట్రంలో అవి ఒక బలమయిన కూటమిగా ఏర్పడి, అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా అసలుకే మోసం తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

 

ఇటువంటి నేపద్యంలో, నరేంద్ర మోడీ సభకు వెళ్ళకుండా తెలుగుదేశంపార్టీ పెద్ద తప్పే చేసిందని అనుకోవచ్చును. అయితే, తెరాస., వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలు చొరవ చూపక ముందే తెలుగుదేశం పార్టీ మేల్కొంటుందా లేక మతతత్వ పార్టీ అనే ఆలోచనతో భారతీయజనతాపార్టీకి దూరంగా ఉండి, ఏటికి ఎదురీదాలని అనుకొంటుందో తానే తెలియజెప్పాలి.

 

ఒకవేళ మళ్ళీ యన్.డీ.యే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడితే, అప్పుడు తెలుగుదేశంపార్టీ దానితో కలిసే ఆలోచనగాని ఉంటే, ఆపనేదో ఇప్పుడే చేయడం ద్వారా రాష్ట్రంలో తన పరిస్తితి చేజారకుండా చుసుకొంటూనే, మరో వైపు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా పొందవచ్చును. అయితే, మతతత్వపార్టీతో అంటకాగితే తన మైనార్టీ ఓట్లన్నీ ఇతర పార్టీల ఖాతాలోకి జమా అయిపోతాయని గానీ ఆ పార్టీ ఆలోచిస్తూ కూర్చొంటే, అప్పడు ముందే చెప్పినట్లు మిగిలిన రెండు పార్టీలు గానీ , లేదా వాటిలో ఏ ఒక్కటయినా గానీ భారతీయజనతా పార్టీతో కలిస్తే, అప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలుకే మోసం వస్తుంది.

 

ఇది గాకుండా, తెలంగాణా అంశంవల్ల కూడా తెలుగుదేశంపార్టీకి రానున్న ఎన్నికలలో భారీనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణాలో ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో తెలంగాణా సమస్యని లేవనెత్తి తెలంగాణా ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టగల నేర్పరి అయిన కేసిర్ అక్కడ తెలుగుదేశంపార్టీని గెలవనిస్తాడని అనుకోలేము.

 

అదేవిదంగా, ఇప్పుడు జైల్లో ఉన్నపటికీ వివిధ పార్టీల నేతలని ఆకర్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒక పెనుసవాలు కాబోతున్నడని చెప్పవచ్చును.

 

ఈ నేపద్యంలో భారతీయజనత పార్టీ చేయందుకోవాలా, వద్దా అనే మీమాంసలో ఎంతకాలం వృధాచేస్తే అంత ఆపార్టీకే ప్రమాదం అని చెప్పవచ్చును. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోగల నేర్పు తెలుగుదేశం పార్టీకి ఉందో లేదో త్వరలోనే తేలిపోవచ్చును.

 

కొసమెరుపు: మోడీ నుండి ఆహ్వానం అందుకొన్న తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు, పిలుపు అందగానే అయన సభకు వెళ్లి ఊహించని విమర్శలు ఎదుర్కోవడం ఇష్టం లేకపోయినా, ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా తాము అఖిలపక్ష సమావేశం హాడావుడిలో ఉన్నందున మీ ప్రమాణస్వీకారసభకు రాలేకపోతున్నామని. తెరాస తరపున అభినందనలు అని లేఖ వ్రాసి, భారతీయజనతాపార్టీతో పొత్తులకు తలుపులు తెరిచే ఉంచుకొని జాగ్రత్త పడ్డారు.