తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాం.. అయ్యో బీజేపీ

 

మీరు 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా చూసే ఉంటారు. అందులో హీరో శ్రీకాంత్ ఎన్నికల సందర్భంగా 'హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తా' లాంటి వింత హామీలు ఇస్తూ ఉంటాడు. అంతెందుకు బయటకూడా చాలామంది రాజకీయ నాయకులు అలాగే ఉంటారు. ఓట్లు కోసం ఆచరణకు వీలు కాని హామీలు ఇస్తుంటారు. గెలిచాక అసలు మేం ఎప్పుడు అన్నాం? ఒకవేళ అన్నా అసలు ఆ హామీలు సాధ్యమవుతాయా? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇంతలో ఐదేళ్లు గడుస్తాయి. ఎన్నికలు వస్తాయి. మళ్ళీ గెలుపు కోసం ఆ నాయకులు అలాంటి హామీలే ఇస్తారు. అప్పుడు ప్రశ్నించాల్సిన ఓటర్లు మాత్రం ప్రశ్నించరు. సర్లే ఇదంతా చైన్ సిస్టంలా జరుగుతుంది కామన్. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గత ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చిందట. ఈ మాట అన్నది ప్రతిపక్షాలు కాదు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.

ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఇరుకున్న పెట్టాలని ఆరోపణలు, విమర్శలు చేయడం కామన్.. కాని వెరైటీగా సొంత పార్టీ నేతనే తన వ్యాఖ్యలతో బీజేపీని ఇరుకున పెట్టేసారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కలర్స్‌ చానల్‌లో ప్రసారమైన ‘అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే’ అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం’ అని ఎన్నికల ముందు, ఇప్పటి పరిస్థితుల గురించి గడ్కరీ ఒక్కమాటలో చెప్పేసారు. అధికారంలోకి రాలేదనుకోండి.. ఇచ్చిన హామీలతో సంబంధమే ఉండదుగా అని భావించామంటూ పార్టీ ధోరణిని చెప్పకనే చెప్పారు. కానీ, ప్రజలు తమకు అధికారం కట్టబెట్టడంతో సమస్య వచ్చిపడిందని సరదాగా వ్యాఖ్యానించారు.

అసలే కాంగ్రెస్, బీజేపీ మీద విమర్శలు చేయడానికి అస్త్రాలు వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు గడ్కరీ రూపంలో మరో అస్త్రం దొరికింది. ఇంకేముంది కాంగ్రెస్ ఇక బీజేపీ మీద విమర్శలు షురూ చేసింది. గడ్కరీ వ్యాఖ్యలు ఉన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘నిజం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమ కలల్ని, నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తెలిసో తెలియకో గడ్కరీ.. రాహుల్ కి రాఫెల్ లాంటి అస్త్రాన్ని ఇచ్చారు.