బోటు ప్రమాదంపై మోడీ ఒకలా... ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మరోలా..!

 

తూర్పుగోదావరి బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అంటూ ట్వీట్ చేశారు. అయితే, బోటు ప్రమాదంపై ఏపీ అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా ఘాటుగా స్పందించారు. బోటు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బోట్లు నడుపుతున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్ణకరమన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా తీవ్రంగా స్పందించారు.  గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, బోటు ప్రమాదంపై అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా, అలాగే తెలంగాణ బాధిత కుటుంబాలకు... కేసీఆర్‌ ప్రభుత్వం అదనంగా మరో 5లక్షలు పరిహారంగా అందజేయనుంది.

తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఎక్కువమంది తెలంగాణవాసులు ఉండటంతో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ చేరుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌... బాధితులను పరామర్శించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.