పేద తల్లి కుమారుడిని... మళ్లీ సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టారుగా...!

 

దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకత పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ ప్రత్యేక హోదా పోరాటం అంశం విషయంలో ఈ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయిందని చెప్పొచ్చు. పార్లమెంట్లో తమ మెజార్టీ ఎక్కువగా ఉన్నా.. కేవలం ఓ చిన్న అవిశ్వాసం తీర్మానం చర్చకు రానివ్వకుండా.. అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకొని డ్రామాలాడిన సంగతి దేశ వ్యాప్తంగా అందరూ గమనించారు. దీంతో మోడీ ప్రభుత్వంపై ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా, మోడీ వివిధ రాష్ట్రాలకి చేస్తున్న అన్యాయం పై, పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. ఇక పరిస్థితి గమనించిన బీజేపీ అప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సానుభూతిని కూడగట్టుకునే చర్యలు మొదలుపెట్టింది.

 

దీనికి సంబంధించి.. బీజేపీ అనుకూల ఛానల్ గా పేరు ఉన్న రిపబ్లిక్ టీవీ దేశ రాజకీయలను ప్రభావితం చేసే ఒక సంచలన కధనం ప్రసారం చేసింది. మోడీకి వ్యతిరేకంగా... పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నారని... కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌, టీడీపీ నేత చంద్రబాబు, ఎన్సీపీ సారథి శరద్‌పవార్‌ కలిసి, మోడీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక కధనం ప్రసారం చేసింది. వంద మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి ముందస్తు ఎన్నికలు పెట్టే పరిస్థితి తేవడం ద్వారా.. ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో మోదీ సర్కారుపై ఇప్పటికే కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే విపక్షాల టార్గెట్‌ అని రిపబ్లిక్‌ చానల్‌ విశ్లేషించింది. దీంతో ఈ కధనం కేవలం మోడీకి దేశ వ్యాప్తంగా సానుభూతి కోసం ప్రసారం చేసింది అన్న వాదనలు అప్పుడే మొదలయ్యాయి... మోడీ ఒక్కరే దేశం కోసం పని చేస్తుంటే, మోడీని పడగొట్టటానికి విపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రధాని మోడీ కూడా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.  బీజేపీ 38వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...  ఓబీసీ వర్గానికి చెందిన, పేద తల్లి కుమారుడినైన తాను ప్రధాని కావడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారని... వెనుకబడిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్న విషయాన్ని అంగీకరించలేక పోతున్నారని మళ్ళీ సెంటిమెంట్ డ్రామా మొదలు పెట్టారు. దీంతో గతంలో తాను ఛాయ్ వాలా అని.. ఈ స్థాయికి ఎదిగానని చెప్పి సెంటిమెంట్ ను పండించి ఏకంగా ప్రధాని పదవిని అధిరోహించిన మోడీ గారు... ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెస్తున్నారని.. మళ్లీ  ఎమోషన్ డ్రామా మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరిచ్చిన హామీలను నెరవేర్చండి బాబు అంటే.. అందరూ కలిసిపోయారు.. నేను ప్రధాని కావడం ఓర్చుకోవడం లేదని.. చిన్నపిల్లలు పితురీలు చెప్పినట్టు మాట్లాడుతున్నారని.. పేద తల్లి కొడుకు కాబట్టే సామాన్యుల బాధలు ఇంకా బాగా అర్ధమవుతాయని... సెంటిమెంట్ డ్రామాలు ఆపి మా హామీలు నెరవేర్చండి బాబూ అని మోడీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.