మే 15.. బీజేపీ చాప్టర్ క్లోజ్...

 

ఇప్పటికే బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. నాలుగేళ్ల ముందు మోడీకి ఉన్న క్రేజ్ వేరు.. ఇప్పుడున్న క్రేజ్ వేరు అని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే అయన పతనానికి దారితీస్తున్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు అంటూ ఎప్పుడైతే సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారో అప్పుడినుండే మోడీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు దళితులపై దాడులు, గో రక్షకుల పేరుతో దాడులు, వారి నియంత పాలన చూసి బీజేపీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దీనికి మోడీ కంచుకోట అయిన గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆ రాష్ట ఫలితాలు చాలు... మోడీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికి. అంతేకాదు నార్త్ లో అన్నిచోట్ల అధికారం చేపట్టి ఎగిరిపడుతున్న బీజేపీకి.. ఇప్పుడు ఎక్కడ ఏ ఉపఎన్నిక జరిగినా షాకుల మీద షాకులు తగులుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. మే పదిహేనో తేదీ బీజేపీ పార్టీ చరిత్రను మలుపుతిప్పే రోజు అని చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే.. మే 12 న కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఫలితాలు మే 15 న రానున్నాయి. అందుకే మే పదిహేనుతో బీజేపీ చాప్టర్ క్లోజ్ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి కారణం.... దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అసహనం పెరిగిపోవడం.. సర్వేల్లో ఫలితాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో బీజేపీ బురదలో కూరుకుపోవడం ఖాయమని తేలిపోయింది. దానికితోడు ఇటీవల ఓ సభలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప.. అవినీతిలో నెంబర్ వన్ అని ప్రకటించి  అమిత్ షా నోరుజారి బుక్కయ్యాడు.

 

మరోవైపు సిద్దరామయ్య బీజేపీని తలదన్నే వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. బీజేపికి తగ్గ రాజకీయాలు చేస్తూ… వారి ఓటు బ్యాంక్ కే గండిపెట్టారు. పైగా.. కర్ణాటక సొమ్మును … కేంద్రం ఉత్తారాదికి ఇస్తుందనే ప్రచారాన్ని కూడా సిద్ధరామయ్య జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో మోదీ వచ్చి.. ప్రచారం చేసినా ప్రయోజనం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోఎత్తు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజల్లో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేస్తున్న అన్యాయం చూసి అక్కడి తెలుగువారు మండిపడుతున్నారు. దీంతో ఉత్తరాది నేతల ఆధిపత్యాన్ని సహించని కన్నడ సంఘాలు.. తెలుగు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మరో వైపు.. ఏపీ నుంచి కూడా.. కొంత మంది … సోషల్ మీడియాలో… బీజేపీకి వ్యతిరేకంగా కన్నడలో ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే.. కర్ణాటకలో బీజేపీ గెలవడం కష్టం అని చెప్పవచ్చు. కర్ణాటకలో ఓడిపోతే... ఈ సంవత్సరం ఆఖరిలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అసాధ్యమే. అందుకే మే 15తో బీజేపీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందన్న  వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో...