నెహ్రు టూ మన్మోహన్… ఇజ్రాయిలంటే ఎందుకు భయపడ్డారు?

 

మోదీ పీఎం అయ్యాక చాలా రోజుల వరకూ ఆయన విదేశీ పర్యటనల మీద కామెంట్సు, కాంట్రవర్సీలు నడిచాయి. అసలు ఆయన స్వంత దేశంలో వుండటమే లేదంటూ వెటకారాలు చేసిన వారున్నారు. విమర్శలు చేసిన వారు కూడా వున్నారు. ఎవరి కోణం ఎలా వున్నా మోదీ ఎప్పటిలాగే తనకు నచ్చింది చేస్తూ పోయారు. అయితే, ఇప్పటికి అయిదుసార్లు అమెరికా వెళ్లిన మోదీ గతంలో భారత ప్రధానులు కాలుమోపని దేశాల్ని కూడా వెదికి పర్యటిస్తున్నారు. అందుక్కారణం… అందరికీ తెలిసిందే!

 

మోదీ విదేశీ పర్యటనలు సరదాలో, కాలక్షేపాలో కాదు. ఆయన అంతర్జాతీయ రంగంలో భారత్ ను అగ్రశక్తిగా నిలిపే వ్యూహంలో వున్నారు. అమెరికా నుంచీ రష్యా దాకా అన్ని దేశాల్ని సాధ్యమైనంత వరకూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, ఏడు ఖండాల్లో ఏ దేశం మనకు ఉపయోగపడుతుందని భావించినా వెంటనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయి ఆర్దిక, ద్వైపాక్షిక, భద్రతా రంగాల్లో అనేక ఒప్పందాలు చేసుకుని వస్తున్నారు. ఈ ప్రయత్నంలో మోదీ ఇజ్రాయిల్ నేలపై కాలు మోపటం… నిజంగా పెద్ద సాహసమే! మిగతా అన్ని దేశాలు తిరగటం ఒక ఎత్తు … మధ్య ప్రాచ్యంలోని అనేక ముస్లిమ్ మెజార్టీ దేశాల నడుమ వున్న ఈ ఏకైక యూదు దేశంలో అడుగు పెట్టడం మరో ఎత్తు!

 

ఇజ్రాయిల్ అనే దేశం భారత్ కు స్వాతంత్రం వచ్చినప్పుడే, 1947లో, ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న యూదులంతా అక్కడికి వలసొచ్చి ఒక దేశంగా ఏర్పడ్డారు. అయితే, చరిత్రలోకి వెళితే ఒకప్పుడు ఇజ్రాయిల్ ప్రాంతమంతా యూదులదే. తరువాత వార్ని ముస్లిమ్ పాలకులు అక్కడ్నుంచి తరిమేశారు. తిరిగి రెండవ ప్రపంచ యుద్ధ అనంతర పరిణామాల్లో పాలస్తీనా లోంచి ఈనాటి ఇజ్రాయిల్ ఏర్పడింది. అక్కడ భారత్ నుంచి సహా ఎన్నో దేశాల నుంచి వలస వెళ్లిన యూదులు స్థిరపడ్డారు. ఇవాళ్ల ఇజ్రాయిల్ ప్రపంచపు అభివృద్ధి చెందిన అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి!

 

1947లో ఇజ్రాయిల్ పార్లమెంట్ మొదటిసారి సమావేశమైనప్పుడు వారు తొలి తీర్మానం చేసింది ఇండియా గురించే! తమ మాతృభూమి అయిన ఇజ్రాయిల్ నుంచి తాము వెళ్లగొట్టబడినప్పుడు గుంపులు గుంపులుగా తాము ఎన్నో దేశాలకు వలస వెళితే… అంతటా ఊచకోతలతోనే స్వాగతం పలికారు. కేవలం ఇండియాలో మాత్రమే 2వేల సంవత్సరాల కిందటే తమకు ఏ హానీ లేకుండా ఆశ్రయం కల్పించారని వారు తీర్మానించారు.అందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు! అయితే, నెహ్రు నుంచి మన్మోహన్ వరకూ మన పాలకులు మాత్రం ఇజ్రాయిల్ ను చూసి చూడనట్టే వ్యవహరించారు. చాలా రోజుల పాటూ చాలా దేశాలు ఇజ్రాయిల్ ను అధికారికంగా గుర్తించలేదు. ఇండియా కూడా ఇజ్రాయిల్ స్వతంత్ర దేశం కాదనీ… పాలస్తీనాలో భాగమని చెబుతూ వచ్చింది. అందుకే, ఇన్ని దశాబ్దాల్లో ఏ ఒక్క భారత ప్రధాని ఇజ్రాయిల్ పర్యటించలేదు. ఆ దేశంతో పెద్దగా దౌత్య సంబంధాలు పెట్టుకోలేదు కూడా! ఇదంతా పాలస్తీనాకు మద్దతుగా మన వారు చేసిన చర్యలే. అలాగే ఇండియాలోనూ వున్న కోట్లాది మంది ముస్లిమ్ ల మనోభావాలకు అనుగుణంగా నడిపిస్తూ  వచ్చిన విదేశాంగ విధానం!

 

ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇజ్రాయిల్ ను అమెరికా అధ్యక్షుడే బోలెడు సార్లు సందర్శిస్తుంటారు. మరి అటువంటప్పుడు భారత్ తో మైత్రి కోరుతున్న ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని ఇండియా తిరస్కరించటం ఎందుకు? ఇజ్రాయిల్ తో మైత్రి వల్ల భారత్ కు ఎన్నో లాభలే తప్ప నష్టాలేం లేవు. మరీ ముఖ్యంగా, భారతీయ ముస్లిమ్ లకు వచ్చిన నష్టం ఎంత మాత్రం లేదు. అందుకే, మోదీ ఇజ్రాయిల్ పర్యటిస్తున్న తొలి ప్రధానిగా చరిత్రకెక్కారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కూడా మరే దేశ ప్రధానికి ఇవ్వని గౌరవం, ప్రాముఖ్యత మోదీకి ఇస్తున్నారు.

 

పోప్, అమెరికా అధ్యక్షుడు తమ దేశానికి వస్తే తప్ప మరెవరి కోసమూ ఇజ్రాయిల్ ప్రధాని ఎయిర్ పోర్ట్ కు వెళ్లరు. కాని, మోదీ కోసం నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వస్తున్నారు. వెల్ కమ్ చెబుతున్నారు. అంతే కాదు, పర్యటన పర్యంతం ఇజ్రాయిల్ పీఎం అన్ని పనులు మానుకుని మన ప్రధాని వెంటే వుండనున్నారు. అనుక్షణం ఆయనతో ప్రయాణిస్తూ కొత్త స్నేహానికి బాటలు వేయనున్నారు. ఇదంతా భారత్ లాంటి ఒక అతి పెద్ద ప్రజాస్వామిక దేశం చేత అధికారికంగా గుర్తింపబడాలని ఇజ్రాయిల్ చేస్తోన్న కృషి. కాని, మోదీ ఇజ్రాయిల్ పర్యటన వల్ల మనకూ చాలా లాభాలే వున్నాయి. పాలస్తీనా మొదలు సౌదీ, ఇరాన్ లాంటి ముస్లిమ్ రాజ్యాలా నడుమ ఒంటరిగా సత్తా చాటుతోంది ఇజ్రాయిల్. అందుకు దాని వద్ద ఉన్న టెక్నాలజీనే కారణం. ఇప్పుడు ఆ రాకెట్, మిస్సైల్ టెక్నాలజీని మనతో వీలైనంత పంచుకునే ఛాన్స్ వుంది. పాకిస్తాన్, చైనా లాంటి శత్రువులతో సతమతం అవుతోన్న మనకు అత్యవసరమైంది అదే! ఈ దృష్టితోనే ఎవరు ఏమనుకున్నా అక్కర్లేదంటూ మోదీ ఇజ్రాయిల్ లో కాలుమోపారు! ఇది ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలో కొత్త మలుపే!