సీబీఐతో గురి చూసి… ఐటీ రైడ్లతో కొడుతోన్న మోదీ!

 

దశాబ్దాల తరబడీ కాంగ్రెస్ భారతదేశాన్ని పాలించింది. ఎట్టకేలకు 2014లో మోదీ తన స్వంత మెజార్జీతో ఇదే రోజు దేశాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. కాని, ఇప్పుడు ఒకసారి వెనక్కి చూస్తే మోదీ కూడా కాంగ్రెస్ మార్కు రాజకీయం బాగానే ఒంటబట్టించుకున్నట్టు కనిపిస్తోంది! మిగతా అన్ని విషయాల్లో నమో కాంగ్రెస్ ప్రధానుల కంటే చాలా డిఫరెంట్. కాని, సీబీఐ,ఐటీ అస్త్రాల్ని ఎక్కుపెట్టడంలో మాత్రం ఆయన గతంలోని పీఎంలు అందర్నీ మించిపోయారనే చెప్పాలి!

 

నరేంద్రుడు ప్రధానై మూడు ఏళ్లు గడిచిన ఈ క్షణంలో సీబీఐ, ఐటీ బృందాలు ఏం చేస్తున్నాయో తెలుసా? ముఖ్యంగా, ఆదాయ పన్ను శాఖ ఉత్రాదిన లాలూకి, దక్షిణాదిన చిద్దూకి తన ప్రతాపం చూపిస్తోంది. మోదీ సర్కార్ వేడికి చిదంబరం అయితే కనీసం స్పందించాడు. లాలూ ఆ ఓపిక కూడా లేక మౌనంగా వుండిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితే చాలా మంది మోదీ వ్యతిరేక నాయకులకి ఎదురవుతోంది! అలాగని వీళ్లందర్నీ మోదీ కేవలం తప్పుడు కేసుల్లో ఇరికించి కక్ష తీర్చుకుంటున్నాడనీ అనలేం. ఏళ్ల తరబడి రాష్ట్రాల్ని, కేంద్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న చాలా మంది నేతలు దొరికినంత దోచేశారు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాకే పార్టీలకతీతంగా నాయకులందరికీ మోదీ ఫోబియా పట్టుకునేలా చేస్తోంది!

 

దాదాపుగా ఒకే రోజు దాడులు ఎదుర్కొన్న ఇద్దరిలో లాలూ సంగతి చెప్పే పనేలేదు. ఆయన దాణా కేసులో తొక్కని కోర్టు గడపంటూ లేదు. బీహార్ కోర్టులు మొదలు సుప్రీమ్ అంతటా ఆయనకు చుక్కెదురు అవుతూ వచ్చింది. చివరకు, పదవి ఊడి ఎన్నికల్లో పాల్గొనలేని అవమానకర పరిస్థితి దాపురించింది. అయినా ఎలాగోలా బీహార్లో బండి నెట్టుకొస్తున్న లాలూకి ఇప్పుడు రోజుకో గండం ఎదురవుతోంది. ఈ మధ్యే ఆయన మాఫియా డాన్ షాబుద్దీన్ ఫోన్ వేసిన ఆర్డర్ల ప్రకారం ఎలా పోలీసుల్ని ట్రాన్స్ ఫర్ చేయించాడో వెలుగు చూసింది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆయన కుమార్తెలు దిల్లీలో అక్రమ మార్గాల్లో చౌకగా భూమి కొన్నారని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ కేసులో భాగంగానే లాలూకు అత్యంత సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి!

 

లాలూపై కేంద్రం ప్రయోగిస్తున్న అస్త్రాల్ని తట్టుకుని ఆయన నిలబడతారా? చెప్పలేం. ఎందుకంటే, త్వరలో ముంచుకొస్తోన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన మోదీ నిలబెట్టబోయే అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. అలాగే, 2019లో యాంటీ మోదీ బ్యాచ్ ఏర్పాటు చేయాలని కుతూహలపడుతున్నాడు. ఇవన్నీ చేయాలంటే లాలూపై ఇలాంటి దాడుల ఒత్తిడి వుంటే… కష్టమే!

 

ఇక లాలూ లాగే ఎండా కాలం వేడితో పాటూ మోదీ హీట్ కూడా ఎదుర్కొంటున్న మరో నాయకుడు చిదంబరం. ఈయనకైతే గండం మరీ దగ్గరగా వచ్చేసింది. చిదంబరం ఇంటికే వచ్చిన అధికారులు సోదాలు చేసేశారు. ఒక మాజీ ఆర్దిక, హోమ్ మంత్రి ఇంటిని రైడ్ చేయటం చిన్న విషయమేం కాదు. మోదీ సర్కార్ బలమైన ఆధారాలు లేకుండానే ఇలా తొందరపడి వుంటుందని అస్సలు భావించలేం. చిదంబరం కొడుకు కార్తి చిదంబరం ప్రస్తుతం జైల్లో వున్న పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణి ముఖర్జీయాల మీడియా సంస్థకి అడ్డదారిలో ఆర్ధిక మేలు చేశాడని ఆరోపణ వెలుగులోకి వచ్చింది. వెంటనే దాడులు మొదలైపోయాయి. వీటి ద్వారా మోదీ ఏం హెచ్చరించదలిచారు?

 

చిదంబరం లాంటి కాంగ్రెస్ అగ్ర నాయకుడి మీద దాడులు చేయించటం ద్వారా నమో తమకు ఎవరైనా లెక్కలేదని చెప్పకనే చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా చాలా మంది నేతలపై ఆల్రెడీ పని చేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ ప్రధానితో నాలుగు మాటలు మాట్లాడి వచ్చి రాష్ట్రపతి అభ్యర్థికి తమ బేషరతు మద్దతు ప్రకటించారు. ఇది ఖచ్చితంగా కాంప్రమైజ్ ఫార్ములానే తప్ప మరోకటి అనుకోటానికి లేదు. నిజానికి మోదీ సక్సెస్ అంతా రాహుల్, సోనియా గాంధీలతో సహా దేశంలోని అత్యధిక శాతం మంది నాయకులు ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణల్లోనే వుంది! ప్రతీ వారికి ఓ గతం వెంటాడుతూ వుండటంతో అందరూ భయం భయంగానే రాజకీయం చేయాల్సి వస్తోంది! మూడేళ్ల మైలురాయి దాటిన మోదీ శకం మూడు దాడులు, ఆరు కేసులుగా సాగిపోతోంది!