చైతన్యరాజు వెనుక చాణక్యులు ఎవరు?

 

 

 

ప్రస్తుతం రాష్ట్ర విభజన నాటకం రాష్ట్రంలో మాంఛి రసపట్టులో వుండగానే, తెలుగు ప్రజలకు రాజ్యసభ ఎన్నికల రూపంలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందుతోంది. రామాయణంలో పిడకల వేటలా, సినిమాలో ఉండే ఉపకథలా తయారైన రాజ్యసభ ఎన్నికల ప్రహసనంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలను చూసి ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. రాజ్యసభ సీట్లకు తుమ్మబంక రాసుకుని కూర్చున్నట్టు సెటిలైపోయిన ముగ్గురు ‘పెద్ద’ మనుషులకు మళ్ళీ రాజ్యసభ టిక్కట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తోంది.

 

 

నిన్నటి వరకూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని గంట మోగించిన గంట, హారన్ మోగించిన జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తుతం చప్పుడు చేయకుండా వుండిపోయారు. ఎమ్మెల్సీ చైతన్యరాజు మాత్రం తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడ్డారు. రాముడు మంచి బాలుడిలా అధిష్ఠానం అడుగుజాడల్లో నడిచే చైతన్యరాజు ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా నిలబడటం వెనుక కాంగ్రెస్ అంతర్గత రాజకీయం చాలా భారీ స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో ట్రిపుల్ ఐటీ శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి పల్లంరాజు మంత్రిత్వశాఖలో వుండే ఈ సంస్థలో చైతన్యరాజు భాగస్వామిగా వున్నారు. పల్లంరాజు ఆశీస్సులతోనే చైతన్యరాజుకు ఈ సంస్థలో భాగస్వామ్యం దక్కిందనేది బహిరంగరహస్యం.


ఇప్పుడు చైతన్యరాజు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడటం అధిష్ఠానం దగ్గర పల్లంరాజుకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం వుంది. ఇది తెలిసినా చైతన్యరాజు బరిలో నిలిచాడంటే, చైతన్యరాజు అభ్యర్థిత్వం వెనుక పల్లంరాజు హస్తం కూడా వుండే అవకాశం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం దగ్గర ఎప్పుడూ తన పట్టును కోల్పోకుండా నెగ్గుకొస్తున్న కేవీపీని ఈ ఎన్నికలలో దెబ్బతీయడానికే చైతన్యరాజును రంగంలోకి దించారా అనే అనుమానాలను కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చైతన్యరాజుకు సీఎం ఆశీస్సులు కూడా వుండే అవకాశాలను కూడా తీసిపారేయాలేమని అంటున్నారు. చైతన్యరాజు బరిలో నిలవటం వెనుక మరో వ్యూహం కూడా వుండే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతోపాటు జగన్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా కలిస్తే చైతన్యరాజు గెలిచే అవకాశం వుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్, వైకాపా తెరచాటు స్నేహం బయటపడే అవకాశం వుంది. అందువల్లే ఒక తిరుగుబాటు అభ్యర్థిని రంగంలోకి దించి, ఆ అభ్యర్థికి వైకాపా ఎమ్మెల్యేల ఓట్లు వేయించాలన్న ఆలోచన ఉన్నట్టు కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా వైకాపా మద్దతుతో మరో రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుందని అంటున్నారు. ఈసారి రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవేవో గజిబిజి వ్యూహాలు వేస్తూ తన సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బుర్ర తిరుగుడు వ్యూహాలు సామాన్య ప్రజలకు ఎంతమాత్రం కొరుకుడుపడటం లేదు.