పవన్ పై రెచ్చిపోయిన రోజా...

 

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి తన నోటికి పని చెప్పింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పవన్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి ఆయన అక్కడికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. అంతేకాదు... ప్రజారాజ్యం గురించి, చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన రోజా పవన్ పవర్ స్టారేమీ కాదని, ఆయన ఓ ప్యాకేజీ ఆర్టిస్టని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడ్డప్పుడు పవన్ కు ఓ ప్యాకేజీ ఇచ్చి తీసుకువస్తారని, అందువల్లే ఆయన టీడీపీని విమర్శించరని ఆరోపించారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు వారసత్వ సినిమాల గురించి పవన్ మాట్లాడాలని సలహా ఇచ్చారు. పోలవరం గురించి అసలు పవన్ కల్యాణ్ కు ఏం తెలుసునని రోజా ప్రశ్నించారు.  "మా అన్న చిరంజీవిగారికి మోసం చేసిన వారిని వదిలిపెట్టను అంటున్నాడు. మీ అన్నకు ద్రోహం చేసిన వాళ్లలో మొదట నువ్వున్నావు పవన్ కల్యాణ్, నెక్ట్స్ మీ బావ అయిన అల్లు అరవింద్ ఉన్నారు. ఆ తరువాత చంద్రబాబు, ఆయన చానల్స్ ఉన్నాయి. మీరందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించి, ఈరోజు ఎవరో చేశారని వాళ్లను వదిలిపెట్టను అంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వంలో మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని భావించి, పరిగెత్తుకు వచ్చి, నువ్వు యువనేతగా ప్రచారం చేశారు. మీ అన్న 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే, మీ అన్నను గాల్లోకి వదిలేసి, నీ పాటికి నువ్వు షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేశావు. ముందు నిన్ను నువ్వు శిక్షించుకో" అని విమర్శలు గుప్పించారు.