వైసీపీ ఎమ్మెల్యేకి... స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో అసెంబ్లీని తలపించే సీన్‌ జరిగింది. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జైన్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన సందర్భంగా... ముఖ‌్యమంత్రి చంద్రబాబు.... వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య మధ్య మాటల యుద్ధం జరిగింది. తన నియోజకవర్గంలో జరుగుతోన్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తోన్న ఫ్యాక్టరీపై తనకే సమాచారం లేదన్న ఐజయ్య.... అసలు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది.... రైతులకు పరిహారం ఎంతిస్తున్నారంటూ ప్రశ్నించారు. వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దన్న వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య..... అసలిక్కడ ఏం చేస్తున్నారో స్థానిక ఎమ్మెల్యేనైన తనకే తెలియదని, ఇక ప్రజలకేమీ తెలుస్తుందన్నారు. 

 

ఐజయ్య మాటలతో సీరియస్‌ అయిన చంద్రబాబు.... కలెక్టర్‌‌ను పంపి... ఇక ముగించాలని స్పీచ్‌కి అడ్డుతగిలారు. అయితే స్థానిక ఎమ్మెల్యేకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ ఐజయ్య అంటుండగానే మధ్యలో కలుగుజేసుకున్న సీఎం....  మైక్‌ కట్‌ చేయించారు.... మాట్లాడింది చాలు... ఇక కూర్చో కూర్చో అంటూ గద్దించారు. అంతేకాదు జనం చేత... ఐజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. దాంతో తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ....  ఐజయ్య అక్కడ్నుంచి నిష్క్రమించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.....అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని ఘాటుగా హెచ్చరించారు. పేదల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.... ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు.

 

అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అడుగడుగునా అడ్డుపడటమే కాకుండా.... మైక్‌ కట్‌ చేసి అవమానపర్చడం.... ముఖ్యమంత్రి గద్దించడం సరికాదని, ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని వైసీపీ మండిపడుతోంది. ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని.... దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలే కానీ... ఇలా అవమానపర్చడం తగదంటున్నారు.