వేధింపుల ఆరోపణలతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా

 

దేశంలో మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న వేళ  కేంద్ర మంత్రి పై వచ్చిన లైంగిక ఆరోపణలు సంచలనం రేపింది విదితమే.అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఎంజే అక్బర్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఏసియన్‌ ఏజ్‌లో ఎడిటర్‌గా పని చేసిన సమయంలో అక్బర్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ పలువురు మహిళా పాత్రికేయులు ఆయనపై ఆరోపణలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా పాత్రికేయురాలు ప్రియా రమణి తొలిసారిగా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత దాదాపు 15 మంది మహిళలు ఇదే విధంగా అక్బర్‌పై ఆరోపణలు గుప్పించారు.

అక్బర్‌ మాత్రం తనపై వస్తున్నా ఆరోపణలను ఖండించారు.ఇవన్నీ నిరాధారమైనవని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కావాలనే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన తోసిపుచ్చారు.తనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్నిఆశ్రయించారు.ఆమెపై పటియాలా న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు.తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడేందుకే ఆయన పదవికి రాజీనామా చేసినట్టు మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.