విజయసాయి మాటలకు విలువ లేదా.. నెంబర్ 2 పొజిషన్ పోయిందా?

ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖ అంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "28న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం." అని జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయండి అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్టే పెట్టారు. విజయ సాయి వ్యాఖ్యలు ట్వీట్లు చూసి ఇంకేముంది వైసీపీ నెంబర్ 2 నే విశాఖను రాజధాని అన్నారంటే ఇక కంఫర్మ్ అయిపోయినట్టే... కేబినెట్ భేటీ తరువాత ప్రకటన తరువాత ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. టోటల్ రివర్స్ అయింది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగిసింది కానీ రాజధానిపై సస్పెన్స్ కి మాత్రం ఎండ్ కార్డు పడలేదు.

మరి ఈ మాత్రం విజయ సాయి ఇంత హడావుడి ఎందుకు చేసారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి విజయసాయి ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ.. మంత్రి పేర్ని నాని మాత్రం విజయసాయివి రాజకీయ వ్యాఖ్యలని సింపుల్ గా తేల్చేశారు. కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. విజయసాయి ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డి మాట్లాడి ఉండవచ్చని.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని తెలిపారు. దీనిని బట్టి చూస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. విజయ సాయి కంగారుపడి వ్యాఖ్యలు చేసారా లేక ప్రస్తుతం పార్టీలో విజయసాయికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.