సొంత బాబాయిని కొట్టి ఎంపీగా పోటీచేసిన చరిత్ర జగన్ ది!!

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. కుట్రలే అజెండాగా వైసీపీ రాజకీయాలు సాగుతున్నాయని ఆరోపించారు. వైసీపీకి రాష్ట్రంలో అధికారం ఎండమావే అని అన్నారు. అక్కడ నరేంద్రమోదీ శాసించడం.. తెలంగాణ సీఎం కేసీఆర్ పాటించడం.. ఇక్కడ జగన్ వాటిని అమల్లో పెట్టడం జరుగుతోందన్నారు. ఈ దుష్టత్రయం ఆంధ్రప్రదేశ్‌ను వశం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఏపీలో ఓటమి తప్పదన్న భయంతో రోజుకోరకం కుట్రలు, కుతంత్రాలు, కులాల మధ్య చిచ్చులుపెట్టి జగన్ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. చింతమనేని 3 నెలల క్రితం మాట్లాడిన వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నాడు తండ్రి శవం అడ్డం పెట్టుకుని రాజకీయం చేసాడు కాబట్టే ఆ మాత్రం సీట్లు జగన్ కి వచ్చాయని ఆనంద్ బాబు విమర్శించారు. తండ్రి శవం చెల్లాచెదురుగా పడిఉంటే సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్. పదవి, డబ్బు మీద ఇంత వ్యామోహం ఉన్న వ్యక్తి దేశంలో మరెవరూ లేరు. రాష్ట్రానికి ఈ సమయంలో ఏ నష్టం జరిగినా తిరిగి రాదు. దీనిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కుట్రలను ఎండకట్టాలని మంత్రి కోరారు. అధికారుల్ని భయపెట్టడం, బెదిరింపులకు పాల్పడ్డం.. ముఖ్యమంత్రిని టచ్ చేస్తున్నావంటూ పోలీసుల మీద జగన్ జులుం ఏస్థాయిలో ఉందో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ఎంపీగా ఉన్న సొంత బాబాయిని కొట్టి రిజైన్ చేయించి కడప ఎంపీగా పోటీచేసిన చరిత్ర వైఎస్ జగన్ దని విమర్శించారు. భారతదేశంలో జగన్ అంతపెద్ద అవినీతి వ్యక్తి ఎవరూ లేరని ఆయన అన్నారు. మోదీ అండతో తనపై ఉన్న కేసులపై డిశ్శార్జి పిటీషన్లు వేసి కేసుల విచారణను అడ్డుకుంటున్నారని నక్కా ఆరోపించారు.