మాస్క్ తీసేసి.. శానిటైజర్ లో కాలేసిన మంత్రి కేటీఆర్

మాట తప్పే వ్యక్తిని ఏమంటారు? అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకొనే రోజుల్లో బతుకుతున్నాం. ఏదో నూటికో కోటికో ఒకరిద్దరు తప్ప దాదాపు రాజకీయ నాయకులంతా అదే కోవకి చెందిన వాళ్లనేది బహిరంగ రహస్యం. చిన్నదో పెద్దదో ఏదొక విషయంలో, ఏదొక సందర్భంలో మాట మార్చడమో, మాట తప్పడమో చేస్తూనే ఉంటారు. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అతీతులు కాదు. తాజాగా ఆయన మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24 గంటల్లోనే శానిటైజర్ లో కాలేశారు.

 

యాంకర్ సుమ తాజాగా మంత్రి కేటీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో హైదరాబాద్ అభివృద్ధి అంశంతో పాటు పలు విషయాలను పంచుకున్నారు. అదంతా బాగానే ఉంది కానీ, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో కేటీఆర్ చెప్పిన దానికి, ఇంటర్వ్యూ ముగిసిన కొద్ది గంటలకు ఆయన చేసిన దానికి అసలు పొంతనే లేదు. కేటీఆర్ మాస్క్ లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. మిమ్మల్ని మాస్క్ లేకుండా చూసి ఎన్ని రోజులైంది అని సుమ ప్రశ్నించింది. దీంతో పొంగిపోయిన కేటీఆర్ మాస్క్ గురించి చిన్నపాటి ఉపన్యాసమే ఇచ్చారు. మనిషికి ముక్కు ఎంత ముఖ్యమో ప్రస్తుతం పరిస్థితుల్లో మాస్క్ కూడా అంతే ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. ఆరేడు నెలల నుంచి తాను ఎక్కడికెళ్లినా మాస్క్ ధరించే వెళ్తున్నానని.. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లలో తిరిగాను, కరోనా పేషెంట్స్ ని కలిసాను.. అయినా తనకి కరోనా సోకలేదని, ఎప్పుడూ మాస్క్ ధరిస్తూ ఉండటమే దానికి కారణమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కొందరుంటారు పేరుకి మాస్క్ పెట్టుకుంటారు, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడతారు అంటూ సెటైర్స్ కూడా వేశారు.

 

అబ్బబ్బా మాస్క్ గురించి మంత్రి కేటీఆర్ ఎంత గొప్పగా సెలవిచ్చారో కదా. ఆగండి ఆగండి కంగారుపడి పొగిడేసి మనం కూడా ఆయనలాగా శానిటైజర్ లో కాలేస్తే ఎలా?. మాస్క్ గురించి ఉపన్యాసం ఇచ్చిన 24  గంటల్లోనే కేటీఆర్ మాస్క్ గొప్పతనాన్ని మరిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. నిన్న ప్రచారంలో మాస్క్ ని ముక్కుకి పెట్టుకోవడమే మరిచారు. మాస్క్ లేకుండా పబ్లిక్ లోకి రానని చెప్పిన ఆయన, కొందరు మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేస్తున్నారని సెటైర్స్ వేసిన ఆయన.. చెప్పిన 24 గంటల్లోనే తప్పులో కాలేశారు. ఏదో ఫార్మాలిటీకి మెడలో మాస్క్ తగిలించుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా అయితే ఎలా మంత్రి గారు. అసలే మిమ్మల్ని ప్రజలు మాస్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. మీరు మాస్క్ మరిచి మా మనోభావాలు హర్ట్ చేయకండి. దయచేసి వాక్సిన్ వచ్చేవరకు మాస్క్ తోనే కనిపించండి.