కేటీఆర్ కామెంట్ల అర్ధమేంటీ! దుబ్బాక కారుకు కష్టమేనా?

తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన దుబ్బాక ఉపఎన్నిక ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. మెజార్టీ సర్వే సంస్థలు అధికార టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని అంచనా వేశాయి. అయినా అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. దుబ్బాక ఎన్నికలో అంతా తానే వ్యవహరించిన ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెన్షన్ పడుతున్నట్లుగా ఉందని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి టీఆర్ఎస్ ముఖ్య నేతల ముఖాల్లో ఆందోళన కనిపిస్తోందని తెలంగాణ భవన్ లోనే చర్చ జరుగుతుందట. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ఓ ప్రకటన కూడా గులాబీ పార్టీలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం గుబులు రేపుతుందనే సంకేతమిస్తోంది. 

 

గ్రేటర్ వరద సాయంపై విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. దుబ్బాక ఉప ఎన్నికపైనా మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. అయితే కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ దుబ్బాకలో బీజేపీ పరిస్థితి ఏంటో మాత్రం కేటీఆర్ చెప్పలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు జరిగిందని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పిన కేటీఆర్.. బీజేపీ గురించి మాట్లాడకపోవడం టీఆర్ఎస్ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. దుబ్బాక ప్రచారంలో తమకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ లెక్కన టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజార్టీ వస్తే ఇతర పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావాలి. అయితే కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని చెప్పిన కేటీఆర్.. బీజేపీ గురించి మాట్లాడకపోవడం ద్వారా దుబ్బాకలో తమకు గట్టిపోటీ ఎదురైందని చెప్పకనే చెప్పినట్లైందని 
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా గులాబీ నేతలను కలవరపెడుతున్నాయని అంటున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ప్రకటించిన మిషన్ చాణక్య .. బీజేపీకి ఏకంగా  51.82 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. టీఆర్ఎస్ కు 35.67 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం బీజేపీ 16 శాతానికి పైగా ఓట్లతో కారు కంటే ముందుంది. అంటే దాదాపు 30 వేల ఓట్లకు ఎక్కువే. ఇదే ఇప్పుడు కారు పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుందంటున్నారు. దుబ్బాక పోలింగ్ ముగియగానే తమ సర్వే వివరాలు ప్రకటించిన పొలిటికల్ లేబొరేటరీ సంస్థ కూడా బీజేపీకి 47 శాతం ఓట్లు, కారుకు 38 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే పొలిటికల్ లేబొరేటరీ సంస్థ సర్వే ఫలితాలను కొట్టిపారేసిన కారు పార్టీ నేతలు.. మిషన్ చాణక్య  అంచనాలతో మాత్రం ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. 

 

తాజాగా వచ్చిన ఆరా సంస్థ ఎగ్జిట్ ఫలితాలు టీఆర్ఎస్ ను మరింత షేక్ చేస్తున్నాయని చెబుతున్నారు. నిజానికి ఆరా సంస్థ అంచనాల్లో కారుకే లీడ్ ఉంది. అయితే అది స్వలంగా ఉంది. టీఆర్ఎస్ కు 47.72 శాతం, బీజేపీకి 44.6 శాతం ఓట్లు వస్తాయని ఆరా తెలిపింది. ఇందులో మూడు శాతం అటు ఇటుగా జరగవచ్చని కూడా సంస్థ వెల్లడించింది. అంటే ఆరా సంస్థ అంచనా ప్రకారం దుబ్బాక బైపోల్ లో ఎవరైనా గెలవొచ్చు. ఇదే ఇప్పుడు కారులో కంగారు పెంచుతోందంటున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగా ముందు అంతా అశ్చర్యపోయారు. అసంభవమని భావించారు. అయితే గ్రేటర్ ఫలితాల్లో ఆరా సంస్థ అంచనాలే నిజమయ్యాయి. అప్పటి నుంచి ఆరా సంస్థ కేటీఆర్ కు సర్వేల్లో అత్యంత నమ్మకంగా మారిందంటున్నారు. టీఆర్ఎస్ తరపున కేటీఆర్ నిర్వహించే సర్వేలన్ని ఆరాకే ఇస్తారని తెలుస్తోంది. 

 

తమకు నమ్మకమైన ఆరా సంస్థ కూడా హోరాహోరీ పోరు జరిగిందనే అంచనాలు ఇవ్వడంతో కేటీఆర్ దుబ్బాక ఫలితంపై టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక పోలింగ్ తర్వాత మంత్రి హరీష్ రావు కామెంట్లు కూడా.. టీఆర్ఎస్ కు అనుకున్నట్లు పోలింగ్ జరగలేదనే సంకేతమిచ్చింది. బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేసిందని, కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ దుర్మార్గ ప్రచారం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ మాటలను బట్టి దుబ్బాకలో టీఆర్ఎస్ కు తీవ్ర పోటీ ఎదురైందని చెప్పక తప్పదు. అంతేకాదు పోలింగ్ రోజు తర్వాత నుంచి హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదు. దుబ్బాక ఫలితం గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు. ఇవి కూడా టీఆర్ఎస్ నేతల్లో పలు అనుమానాలను కల్గిస్తున్నాయి. దుబ్బాకలో ఏదైనా జరగవచ్చని వారంతా భయపడుతున్నట్లు తెలుస్తోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికపై ఇప్పటివరకు వచ్చిన ఎగ్టిజ్ పోల్స్ లో ఒక్క నాగన్న సర్వేలో మాత్రమే టీఆర్ఎస్ కు 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని తేలింది.  మొత్తంగా కేటీఆర్ తాజా కామెంట్లు, హరీష్ రావు సైలెంట్ ను బట్టి దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దుబ్బాక ఫలితం గులాబీకి వ్యతిరేకంగా వచ్చినా అశ్చర్యం లేదంటున్నారు.