నా తండ్రి చావుకు నువ్వే కారణం పవన్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్టణం జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమంటూ పవన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి,కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్‌కుమార్‌ స్పందించారు. మన్యంలో అశాంతికి పవన్‌ కల్యాణే కారణమని శ్రావణ్‌ అన్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆజ్యం పోసి తన తండ్రి, సోమ మృతికి కారణమయ్యారని ఆరోపించారు.

‘‘నా తండ్రి కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కోల్పోవడానికి ముఖ్యమంత్రి కంటే మీరే బాధ్యత వహించాలి. శాంతంగా ఉన్న మన్యంలో ఆనాడు పాడేరు సభలో పవన్ మాట్లాడి ఆజ్యం పోశారు. అందుకు ఆయనే బాధ్యత వహించాలి. ఇద్దరు గిరిజన నేతలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శకు కూడా రాలేని మీరు.. మన్యం గిరిజనుల గురించి మాట్లాడతారా?’’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాల జీవో నిలిపివేశారని గుర్తుచేశారు. తన తండ్రి కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగా గళమెత్తారని చెప్పారు. ఏజెన్సీలో జాబ్ మేళా, యువతకు శిక్షణ, నిరుద్యోగ భృతి ద్వారా ముఖ్యమంత్రి ఉపాధి కల్పించి యువత పక్కదారి పట్టకుండా చూస్తున్నారని తెలిపారు