జగన్‌ ఉగ్రవాది.. అవంతిపై గంటా ఫైర్

 

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ బాటలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడతారని, ఈ విషయాన్ని అవంతి తన సన్నిహితుల వద్ద చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గంటా మాత్రం అనూహ్యంగా టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎంపీ అవంతిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన గంటా.. పార్టీ వీడిన తర్వాత అవంతి చంద్రబాబుపై చేసిన ఆరోపణలను ఖండించారు. అవంతి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. జగన్‌ ఉగ్రవాది కంటే ప్రమాదకారి, రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న అవంతి.. ఇప్పుడాయన వద్దకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఒకప్పుడు 'చంద్రబాబు కాపు మిత్ర' అని అవంతి శ్రీనివాస్ పొగిడారని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుని కాపు వ్యతిరేకని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లే ముందు చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉంటూనే చంద్రబాబు నా రోల్‌మోడల్‌ అని చెప్పానని పేర్కొన్నారు. అవంతి కోసం భీమిలి టికెట్ సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పుకొచ్చారు. అయినా అవంతి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వీడారని మంత్రి గంటా ఆరోపించారు.