కేసీఆర్‌కు ధైర్యముంటే ఏపీ రాజకీయాల్లోకి రావాలి

 

కేసీఆర్ వందకు వంద శాతం ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు కేసీఆర్ ఏపీకి రావాలి అంటుంటే.. మరికొందరు కేసీఆర్ వస్తే మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఆనందబాబు కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే.. ఆంధ్రా రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టాలని సవాల్‌ విసిరారు. ఆంధ్రాలోకి వస్తామని మాటలు చెప్పడం కాకుండా.. ధైర్యంగా రావాలని అన్నారు. వైసీపీ, జనసేనలతో తెలంగాణలో చేసిన తెరచాటు రాజకీయాలు కాకుండా బహిరంగంగా కలిసి రావాలని అన్నారు. టీఆర్ఎస్ కారుకు.. బీజేపీ, వైసీపీ, జనసేన, ఎంఐఎం అనేవి నాలుగు చక్రాలుగా మారాయన్నారు. వైఎస్ జగన్‌కు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదని, అందుకే రాష్ట్ర వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ జనసేన, వైసీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో బినామీ ఆస్తులను సంరక్షించుకోవడానికే జగన్.. కేసీఆర్‌తో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపించారు.