జగన్ సభకు తెలంగాణ బస్సులు.. రైలు కిందపడి చనిపోయేవాడ్ని

 

నిన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ 'బీసీ గర్జన' సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభపై టీడీపీ నేత, బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ‘గత ప్రభుత్వం పదేళ్లలో బీసీలకు కేవలం రూ.3,200కోట్లు ఖర్చు చేసింది. 2004లో వైఎస్‌ 11ఫెడరేషన్లను ఏర్పాటు చేసినా వాటికి అధ్యక్షులను నియమించలేదు. టీడీపీ ఈ ఐదేళ్లలో రూ.42వేల కోట్లు ఖర్చు చేసింది.' అని తెలిపారు. తెలంగాణకు చెందిన కోదాడ, నల్గొండ ఆర్టీసీ డిపోల నుంచి బస్సుల్లో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పంపిన మనుషులతో సభలు పెట్టుకున్నావు. నీకు సిగ్గుందా? అని విమర్శించారు. 'తెలంగాణలో స్థిరపడిన ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను తెలంగాణలో ఓసీ జాబితాలో చేర్చారు. వాటిపై బీసీ మంత్రిగా ఉన్న తలసాని ఎందుకు మాట్లాడలేదు?. ఆ స్థానంలో నేను ఉండుంటే రైలు కిందపడి చనిపోయేవాడ్ని. ఆయన ఇక్కడకు వచ్చి బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో మూడోవంతును బీసీలకే ఖర్చు చేస్తున్నాం. 2019 ఎన్నికల్లో ఒక్కఓటు కూడా పోదు. ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నా. నువ్వు రమ్మన్న చోటుకి నేను ఒక్కడినే వస్తా. మీరు ఎంతమంది వచ్చినా సరే. బీసీల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందీ లెక్కలతోసహా వెల్లడిస్తా. ప్రభుత్వం తప్పును నువ్వు చూపిస్తే అక్కడే క్షమాపణ చెబుతా. నా సవాల్‌ను స్వీకరించు. ఏం చేయలేదో చెప్పు. తేదీ, సమయం నువ్వే ఫిక్స్‌ చెయ్యి’ అంటూ మంత్రి అచ్చెన్న జగన్‌కు సవాల్‌ విసిరారు.