మారాల్సింది మన ఆలోచనే....

ఏదైనా మన మంచికే జరిగింది అనుకోవాలి అంటుంటారు మన పెద్దవాళ్ళు. అందుకోసం ఓ ఉదాహరణ కూడా చెబుతుంటారు. తేలు కుడితే పాము కుట్టలేదని సంతోషించమంటారు. పాము కరిస్తే ప్రాణం పోలేదని సంతోషించమంటారు. వినటానికి బాగానే వున్నా, నిజంగా ఆ సూత్రాన్ని జీవితంలో అన్వయించుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనసు మాట వినదు. దాంతో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మథన పడిపోతుంటాం. ఒకసారి మా అన్నయ్య ఇలానే పరిస్థితులు బాలేవు. అన్నీ నాకెదురు తిరుగుతున్నాయి. బాడ్ టైం అనగానే  మా పెద్దనాన్నగారు తప్పు. నీ ఆలోచనా విధానం మార్చుకుని ఆ పరిస్థితులని చూడు. అప్పుడు నువ్వా మాట అనవు అంటూ ఓ కథ చెప్పారు. ఇప్పటికీ పరిస్థితులు బాలేవు అనిపించగానే మా అందరికి ఆ కథే గుర్తుకొస్తుంది. ఈ రోజు మనం ఆ కథనే చెప్పుకోబోతున్నాం. 

కథ అనగానే అనగనగా అని మొదలు పెట్టాలి కదా! అనగనగా ఓసారి ఓ గురువుగారు, శిష్యుడు దేశసంచారం చేస్తూ చేస్తూ చివరికి ఓ రోజున వారి స్వంత ఊరికి చేరారు. వారి ఆశ్రమం చేరగానే అమ్మయ్య అనుకున్నారు. ఎంతో ప్రయాణం తర్వాత ఆశ్రమానికి వచ్చారేమో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. తినటానికి ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తే రాత్రి అవటం మూలాన ఏమీ దొరకలేదు. దాంతో ఖాళీ కడుపుతో పడుకోవలసి వస్తుంది. అప్పుడు గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. శిష్యుడు అశ్చర్యంగా గురువుగారి వైపు చూస్తాడు. ఇదేంటి తినటానికి ఏమీ దొరక్కపోయినా "నీ దయ అపూర్వం" అని దేవుణ్ణి పొగుడుతున్నాడు ఈయన అని. కానీ బయటకి ఏమీ అనడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాకా కనీసం తినటానికి ఓ పండో, ఫలమో కూడా దొరకపోయినా బాగా అలసిపోయారేమో నిద్రపోవటానికి సిద్ధపడ్డారు గురుశిష్యులిద్దరూ. ఇంతలో ఓ పెద్ద గాలిదుమారం మొదలయ్యింది. వారి పాక పైకప్పు కాస్తా ఎగిరిపోయింది. అది చూసిన గురువు గారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటాడు. ఇంతలో జోరున వాన కూడా మొదలవుతుంది. పైకప్పు లేదేమో ఇద్దరూ బాగా తడిసిపోతారు. అప్పుడు మళ్ళీ గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చేస్తుంది.

ఓ పక్క తినటానికి తిండి లేదు, విశ్రాంతిగా పడుకుందామంటే గాలి దుమారం, జోరున వాన. అయినా గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం"అంటుంటే శిష్యుడికి చాలా కోపం వచ్చేస్తుంది. మనల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే దేవుడి దయ అపూర్వం అంటారేంటి అని ప్రశ్నిస్తాడు గురువుగారిని. అప్పుడు గురువుగారు ఇలా చెబుతారు. మనం మన ప్రయాణంలో ఏవేవో తిన్నాం. ఈ పూటకి ఖాళీ కడుపుతో ఉపవాసం వుంటే మన ఆరోగ్యానికి మంచిదని భావించే ఆ పరమాత్మ మనకి తినటానికి ఏమీ దొరకకుండా చేశాడు. అలసిపోయిన మన శరీరాలు సేదతీరాలనే గాలి మనకి తగిలేలా గుడిసె పైకప్పుని తొలగించాడు. మట్టికొట్టుకుపోయిన మన శరీరాలకి చక్కటి  స్నానం అందించాలని ఇంతటి వర్షాన్ని ఇచ్చాడు. మన పై ఇంత దయ చూపిస్తుంటే ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఎలా వుంటాం అంటారు గురువుగారు. అలా అంటూ ఆ వానలో ఆనందంతో గెంతుతూ నాట్యం చేస్తుంటాడు. 

ఈ రోజు మనం చెప్పుకున్న కథలో ఒకే పరిస్థితికి ఇద్దరి వ్యక్తుల ప్రతిస్పందన ఎలా వుందో చూశాం. ఒకరు ఆనందంగా వున్నారు. మరొకరు భాధపడ్డారు. ఒకటే పరిస్థితులు ఒకరికి అనందాన్ని, మరొకరికి దుఖాన్ని ఎలా అందించాయి? "దృకృథం"లోని తేడాయే వారి వారి ఆనందానికి, బాధకి కారణం ఎదురయ్యే పరిస్థితులని మనం ఏ విధంగా చూస్తామన్న చిన్న విషయం పై ఆధారపడే అవి మనకి ఆనందాన్ని కానీ, దుఖాన్ని కానీ అందిస్తాయని తెలుసుకుంటే, మారాల్సింది పరిస్థితులు కాదు మన ఆలోచన అని అర్థమవుతుంది మనకి...ఏమంటారు?

-రమ ఇరగవరపు