కొత్త స్నేహాలు కొత్త కష్టాలు

 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఎవరో దారినపోయే దానయ్య అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ పీకకి చుట్టుకొన్నాయి.

 

అసలే పుట్టెడు కష్టాల్లో మునిగున్న వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి ఈవ్యహారం తలకు మించిన భారంగా మారింది. రాష్ట్రంలోమిగిలిన అన్ని రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే, ఒక్క వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు మౌనం వహిస్తోంది అని ప్రతిపక్షాలు అడుగుతుంటే జవాబు చెప్పుకోలేక సతమతమవుతోంది.

 

ఇక వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి బద్దవిరోదయిన తెలుగుదేశం పార్టీకూడా ‘మియా, బీబీ రాజీ హై క్యా?’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి. నిన్నమొన్నటివరకు యం.ఐ.యం.తో అంటకాగిన కాంగ్రెస్ పార్టీ సైతం అక్బరుమియాని నిలదీస్తుంటే, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఏమిటి చప్పుడు చెయ్యట్లేదు? అని దెప్పి పొడుస్తున్నా జవాబు చెప్పలేకపోతోంది.

 

వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ, యం.ఐ.యం. పార్టీల మద్యన కొత్తగా పరిమలిస్తున్న స్నేహసంబందాలే అందుకు కారణమని మీడియా కూడా విశ్లేషించినా కూడా దానికి వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనమే సమాధానం అంది.

 

అసలు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనకడుగు ఎందుకు వేస్తోందని ఆలోచిస్తే, మొదటిది యం.ఐ.యం. పార్టీతో స్నేహ సంబందాలు కొనసాగించాలానే దాని ఆలోచన కనబడుతుంది. ఆ పార్టీతో చేయి కలిపితే రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి ఉన్న ముస్లింఓటు బ్యాంకును తన ఖాతాపద్దులో రాసేసుకోవచ్చుననే ఆలోచన కనిపిస్తుంది. అందువల్లే ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ దైర్యంచేసి నలుగురితో నారాయణ అని అనలేకపోతోంది. ఒకవేళ అంటే ఆ పార్టీతో నిఖాకి ముందే తలాక్ అయిపోతుందని దానికి తెలుసు. దానితోనే ముస్లిం ఓటు బ్యాంకుకి నీళ్లోదులుకోక తప్పదని కూడా తెలుసు గనుకనే ఈ మౌనం.

 

అలాగని, ఇప్పుడు మానంవహిస్తే, అసలే చేతిలో మతగ్రంధం పట్టుకొని తిరుగుతూ క్రీస్టియన్ మతస్తులను, ముఖ్యంగా ఆమతం పుచ్చుకొన్న వారినీ తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మతతత్వ పార్టీగా మార్చేరన్న అపప్రద నిజం చేసినట్లవుతుంది. అప్పుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ, యం.ఐ.యం.పార్టీలు రెండుకూడా ఒకే కలుగులోదాగిఉన్నరెండు ఎలుకలు వంటివని అందుకే చేతులు కలుపుతున్నాయని శత్రుపార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

అదికాక, వారి ఈ స్నేహం హిందూ ఓటు బ్యాంకుని కూడా ఏంతో కొంత ప్రభావితం చేయకమానదు. కానీ, కాలక్రమంలో ప్రజలు ఈవిషయాన్ని మరిచిపోవచ్చును. అయినా కూడా మిగిలిన పార్టీలు మాత్రం ఎన్నికల సమయంలో దీనిని ప్రజలకి గుర్తుచేసి తమ ప్రధాన అస్త్రంగా మార్చుకొనేందుకు ప్రయత్నించకమానవు. అందుకే, ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనప్రదర్శన చేయక తప్పట్లేదు.

 

ముందు నుయ్యి వెనుక గొయ్యి చందాన్న తయారయిన ఈ విషయంలో ఎలా ప్రతిస్పందిన్చాలో, దానికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో అని వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనం పాటిస్తూ ‘కిం కర్తవ్యమ్?’ అంటూ లోలోన ఆలోచనలు చేస్తోంది.

 

అయినా, దారినపోయే ఒక దానయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ తలకు చుట్టుకోవడం దాని దురదృష్టంగాక మరేమిటి? ‘నయి సాల్ కేలియే హమారీ తోఫా కబూల్ కరో’ అంటూ అక్బర్ ఇచ్చిన ఈ నూతన సంవత్సర కానుకని మరి వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా లేక ఇప్పుడే తలాఖులు చెప్పుకొని బయట పడుతుందో చూడాలి మరి.