తరలిపోతున్న ఐటీ కంపెనీలు.! జగన్ సర్కారు నిర్ణయంతో 18వేల ఉద్యోగాలు మటాష్.! 

కొత్త ఉద్యోగాలేమో గానీ, ఉన్న ఉద్యోగాలను ఊడబీకే విధంగా జగన్ ప్రభుత్వ విధానాలు కనిపిస్తున్నాయి. అసలే ఏపీకి కొత్త కంపెనీలు రావడానికి భయపడుతున్నాయని ప్రచారం జరుగుతుంటే... ప్రభుత్వ నిర్ణయాలతో ఉన్న కంపెనీలూ వెళ్లేపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే, కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుండగా... ఇఫ్పుడు మరో వార్త సంచలనం రేపుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం... సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసుకుంది. దాంతో, మిలీనియం టవర్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మార్చి 30లోపు మిలీనియం టవర్స్ ను ఖాళీ చేయాలంటూ ఆ నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది.

అయితే, 5వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం 300 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కాండ్యుయేట్ కంపెనీ.... ప్రభుత్వ నోటీసులతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం ఆపరేషన్సే షట్ డౌన్ చేయాలని కాండ్యుయేట్ కంపెనీ బోర్డు డెసిషన్ తీసుకుందని అంటున్నారు. తమ కార్యకలాపాల కోసం కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్న కాండ్యుయేట్ కంపెనీ.... హైదరాబాద్ లేదా కొచ్చిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిలీనియం టవర్స్ లో పనిచేస్తున్న 2400మందిని హైదరాబాద్ లేదా కొచ్చి తరలించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

ఇక, మిలీనియం టవర్స్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఎల్ అండ్ టీ కూడా మార్చి 30 తర్వాత ఆ బిల్డింగ్ ను ఖాళీ చేయనున్నాయి. దాంతో, మిలీనియం టవర్స్ నుంచి దాదాపు 18వేల మంది ఉద్యోగులు తరలిపోనున్నారని చెబుతున్నారు. అయితే, టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ కంపెనీల కోసం ఆనాడు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన కాండ్యుయెంట్‌ సంస్థను విశాఖ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కష్టపడింది. కానీ, ఇఫ్పుడు సచివాలయం పేరుతో భవనాన్నే ఖాళీ చేయమంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో.... మొత్తం ఏపీనే వదిలివెళ్లిపోవాలని ఆయా ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎంతోకష్టపడి తీసుకొచ్చిన ఐటీ కంపెనీలను ఇలా తరిమేయడం రాష్ట్రానికి మంచిది కాదని విపక్షాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.