ఐటీ దాడుల్లో బయటపడుతోన్న ‘మేఘా‘ గుట్టు... కాంగ్రెస్ తో 100కోట్ల ఆర్ధిక లావాదేవీలు...!

 

ఐటీ దాడుల్లో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గుట్టురట్టు అవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తో మేఘా కంపెనీ నడిపిన రాజకీయ లావాదేవీల డొంక బయటపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టి వేలకోట్ల రూపాయల లబ్ది చేకూర్చిన ఓ ముఖ్యనేతకు అండగా ఢిల్లీ స్థాయిలో మేఘా సంస్థ జరిపిన ఆర్ధిక లావాదేవీల బండారం ఐటీ దాడుల్లో బట్టబయలైంది. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా పార్టీల అధినేతలను కలిసి హడావిడి చేసిన ఓ పార్టీ అధినేతకు మద్దతుగా మేఘా ఈ రాజకీయ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి అనుకున్న సీట్లు రాక, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటైతే ఉపప్రధాని కావాలని కలలుగన్న తెలంగాణ ముఖ్యనేత కోసం మేఘా కంపెనీ.... హస్తినలో మధ్యవర్తిత్వం నడిపినట్లు ఐటీ రైడ్స్ లో ఆధారాలు దొరికాయట. 

దేశవ్యాప్తంగా మేఘా కంపెనీ కార్యాలయాలు, మేఘా ఫ్యామిలీ నివాసాల్లో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు.... దొరికిన ఆధారాల మేరకు.... ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ బేరర్ల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఏఐసీసీ ఫైనాన్షియల్ విభాగంలో పనిచేస్తున్న మాథ్యూస్​వర్గీస్​ఇంటిపై ఐటీ దాడులు చేశారు. ఢిల్లీ, కేరళలోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి... మాథ్యూస్​వర్గీస్​కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశాన్ని మార్చేస్తానంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా పార్టీల అధినేతలను కలిసిన తెలంగాణ ముఖ్యనేతకు మద్దతుగా మేఘా కంపెనీ.... కాంగ్రెస్ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లు ఐటీ దాడుల్లో తేలిందట. ఏఐసీసీకి మేఘా కంపెనీకి మధ్య జరిగిన 100కోట్ల రూపాయల లావాదేవీపై ఐటీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.