పవన్ తిడితే.. చిరు ఆలింగనం... జగన్ విషయంలో పొంతనలేని మెగా బ్రదర్స్ ప్రవర్తన

వైసీపీ ప్రభుత్వంపై విపరీతమైన దూకుడుతో ముందుకు వెళ్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. రైతుల సమస్యలు, ఇసుక కొరతపై ఆందోళనలు చేశారు. అసలు సీఎంగా జగన్ ని తాను గుర్తించనంటూ ప్రకటించేశారు. సీఎం అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియం అమలుపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఒక దశలో పవన్ కామెంట్స్ పై స్పందించిన సీఎం జగన్ కూడా పవన్ కల్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించారు. పవన్ మూడు పెళ్లిల్లు చేసుకున్నారని విమర్శించారు. దీంతో సీఎం జగన్ కి పవన్ కల్యాణ్ కు మధ్య వివాదం పీక్ స్టేజ్ కు చేరింది. ఒక దశలో బిజెపి అమిత్ షా అంటే జగన్ కు భయం అంటూ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఇంకా ముందుకెళ్లి తాను బిజెపికి ఎప్పుడూ దూరంగా లేనని చెప్పారు. 

పవన్ తీరు అలా ఉంటే ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. తనకి తమ్ముడికి అస్సలు సంబంధం లేదన్న ధోరణిలో ఉన్నారు. సైరా సినిమా విడుదలకు సీఎంని కుటుంబ సమేతంగా కలిసిన చిరంజీవి సిఎంను కొనియాడారు. అలాగే చిరంజీవి భార్య సీఎం సతీమణికి చీర పెడితే తిరిగి భారతి కూడా ఆమెకు చీర పెట్టారు. పోనీ అది సినిమా ప్రమోషన్ లో భాగం కదా అనుకుంటే తాజాగా మహిళలపై అత్యాచార నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సీఎం జగన్ చేసిన దిశా చట్టాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేశారు చిరంజీవి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఒక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సమస్యల పై తమ్ముడు కాకినాడలో దీక్ష చేస్తున్న రోజు అన్న జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. దీంతో చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నారా అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్ముడు పవన్ వెంటే ఉంటారు. జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి జనసేన వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నారు. అయితే మరోవైపు చిరంజీవి జగన్ కి దగ్గరవుతున్నారా లేక తమ్ముడికి జగన్ కి మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద కొణిదెల కుటుంబ కహాని ఎంటో అర్థం కాక మెగా ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు.