ఎన్నికల నాటికి మెగా ఫ్యామిలి జనసేనకు ‘ సైరా ‘ అంటుందా?

తెలుగు సినిమా రంగంలో టాలెంట్ వున్న వారికి ఎప్పుడూ ఆదరణ వుంటుంది లాంటి కామెంట్స్ ఎన్ని వినిపించినా… టాలీవుడ్ అనగానే మనకు కొన్ని ఫ్యామిలీలే గుర్తుకు వస్తాయి. వాటిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి! నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి కుటుంబాల్లాగే చిరు ఫ్యామిలీ కూడా తెలుగు సినిమా రంగంలో పాతుకుపోయింది. చిరంజీవి నుంచీ నిహారిక వరకూ తెలుగు సినిమాని ఆ కుటుంబం ఎంతగా ఆక్రమించవచ్చో అంతా అక్రమించేసింది. అయితే, అది తప్పనేం చెప్పలేం. జనం ఆదరిస్తున్నారు కాబట్టి మేం సినిమాలు చేస్తున్నాం అంటారు మెగా సెలబ్రిటీలు! అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే, మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా కూడా అంతా ఒక్కటై ముందుకు సాగుతారా? ఇప్పుడు ఇదే డౌట్ మెగా ఫ్యాన్స్ లో ఏర్పడుతోంది! జనసేనతో జనంలో దూసుకుపోతోన్న పవన్ ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటారా? ఎలక్షన్ సినిమా క్లైమాక్స్ కల్లా మెగా హీరోలంతా పవర్ స్టార్ కి మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తారా?

 

 

మెగా ఫ్యామిలి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది చిరంజీవే! ఆయన స్వయంకృషితో వేసిన పునాది రాళ్లే ఇప్పుడు నాగబాబు, పవన్, అల్లు అర్జున్, చరణ్, సాయి ధర్మతేజ్, వరూణ్ తేజ్, శిరీష్, నిహారిక… ఇంత మందికి నిలువ నీడనిస్తున్నాయి. మెగా హీరోలు, హీరోయిన్ కి టాలెంట్ వుంటే వుండొచ్చు. కానీ, వారందరికీ చిరు పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిస్తుందనేది కూడా నిజమే! ఇదే సూత్రం పాలిటిక్స్ లోనూ నిజమైంది. చిరంజీవి ప్రజా రాజ్యం ప్రాజెక్ట్ డిజాస్టరే అనే చెప్పుకోవాలి. అయినా అదే ఇవాళ్ల జనసేన ఆవిర్బావానికి మూలం. పీఆర్పీలో యువరాజ్యం నాయకుడిగా పవన్ చురుగ్గా పని చేశాడు. కానీ, ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయిపోయాడు. కారణాలు ఏవైనా కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం తరువాత మరింత మౌనం దాల్చాడు. ఉన్నట్టుండీ 2014కి ముందు జనసేనతో జనంలోకి వచ్చి మోదీకి, బాబుకి మద్దతు పలికాడు. కానీ, అన్నయ్య మాత్రం కాంగ్రెస్ లో వుండిపోయారు. తమ్ముడు కాంగ్రెస్ హఠావ్ అంటూ చెలరేగిపోయాడు!

 

 

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్స్ ఇప్పటి పరిస్థితి ఏంటి? 2019లోనూ చిరు కాంగ్రెస్ పక్షానే ప్రచారం చేస్తారా? అసలు ఏపీ కాంగ్రెస్ కు చిరంజీవి అంతటి పాలోయింగ్ వున్న స్టార్ అవసరం వుందా? మరీ దయనీయంగా తయారైన ఆంధ్రా కాంగ్రెస్ కు చిరంజీవి ఏం ఉపయోగపడగలరు? ప్రస్తుతానికైతే సైరా సినిమా చేస్తోన్న మెగా స్టార్ ముందు ముందు జనసేనకి మద్దతు ఇవ్వటానికి సైరా అనరని గట్టిగా చెప్పలేం!

 

 

మెగా స్టార్ మౌనంగా సాగిపోతున్నా మెగా బ్రదర్ నాగబాబు మాత్రం అవసరమైనప్పుడు నోరు తెరుస్తున్నారు. ఆయన కూడా జనసేనలో అధికారికంగా చేరకున్నా పవన్ కు మద్దతు అవసరమైన్పుడు గట్టిగా స్పందిస్తున్నారు. తాజాగా జగన్ వ్యక్తిగత దూషణతో పవన్ పై దాడి చేసినప్పుడు నాగబాబు రంగంలోకి దిగారు. మెగా ఫ్యామిలి నుంచీ పవన్ కు మద్దతుగా మాట్లాడిన వ్యక్తి నాగబాబు ఒక్కరే! జగన్ మాటల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంతకంటే ముందు నాగ బాబు కత్తి మహేష్ విషయంలో కూడా కలుగజేసుకున్నారు. పవన్ పై కత్తి వ్యాఖ్యల్ని పబ్లిగ్గా ఖండించి ఘాటు హెచ్చరికలు చేశారు. రాముడిపై కత్తి మహేష్ వ్యాఖ్యల దుమారం సమయంలో కూడా నాగబాబు అతడ్ని టార్గెట్ చేశారు. అలా చేయటం … పవన్ మీద గతంలో కత్తి చేసిన వ్యాఖ్యల వల్లేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! నిజంగా రాముడి మీద కత్తి వ్యాఖ్యల్ని నాగబాబు ఖండించారని అనుకోవటం మన అమాయకత్వమే అవుతుంది!

 

 

పవన్ కు ఇబ్బంది వచ్చినప్పుడల్లా… ఇప్పటికైతే నాగబాబే మాట్లాడుతున్నారు. మరి ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ పరిస్థితి మారుతుందా? నాగబాబు అధికారకంగా జనసేనలో చేరి పోటీ చేయటం లాంటివి చేస్తారా? చిరు కూడా సైరా పూర్తికాగానే తమ్ముడికి అండగా బరిలోకి దిగుతారా? పోటీ చేయకున్నా ప్రచారం చేసి పెడతారా? చరణ్ , బన్నీ లాంటి యంగ్ హీరోల సంగతేంటి? ఇప్పుడే చెప్పలేం! కానీ, మెగా ఫ్యామిలి అనుబంధం తెలిసిన వారు మాత్రం … అందరూ ఏ క్షణానైనా పవన్ వెనుక నిలిచే ఛాన్స్ వుందనే అంటారు! అదే జరిగి చిరు నుంచీ చరణ్  వరకూ మెగా టీమ్ మొత్తం జనసేనకు జైకొడితే అది రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పే అవుతుంది! ప్రధానంగా సీఎం అయిపోయినట్టు గట్టిగా భావిస్తోన్న ప్రతిపక్ష నేత జగన్ … ఉసూరుమనే ఫలితాలు కూడా రావచ్చు!