మెదక్ ఉప ఎన్నికలకే అంత ప్రాధాన్యత ఎందుకు?

 

రేపు తెలంగాణాలో మెదక్ లోక్ సభకు, ఆంధ్రాలో నందిగామ శాసనసభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి, నూరు రోజుల పరిపాలన పూర్తి చేసుకొన్న తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. కనుక సహజంగానే ఈ ఉప ఎన్నికలు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు తీర్పునిచ్చే ఎన్నికలుగా భావించడం సహజం. కానీ మెదక్ ఉప ఎన్నికలకు కనిపిస్తున్న ప్రాధాన్యత నందిగామ ఉపఎన్నికలకు కనబడటం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్ర ప్రజలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు గానీ నందిగామ ఉప ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతే కాదు ఈ ఉప ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు అని కూడా భావించడం లేదు. కానీ తెలంగాణాలో మాత్రం మెదక్ ఎన్నికలను అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రజల ఇవ్వబోయే తీర్పుగానే భావించడం విశేషం.

 

అందుకు బలమయిన కారణమే ఉంది. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణాను పాలించిన ఆంధ్రా పాలకులు తెలంగాణాను దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప దానిని అభివృద్ధి చేయలేదని, అందువల్లనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించవలసి వచ్చిందని తెరాస అధినేత కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. తమ పార్టీకే ఓటేసి గెలిపిస్తే తెలంగాణాను అభివృద్ధి చేసి చూపిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేరు. కనుకనే మెదక్ ఉప ఎన్నికలు అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకే తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ మెజార్టీతో గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

 

అయితే తెలంగాణాలో తెరాస అధినేత కేసీఆర్ వాగ్దానాలు చేసినట్లే ఆంధ్రాలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చేరు. అయినప్పటికీ నందిగామ ఉప ఎన్నికలకు ప్రజలు, ప్రత్యర్ధ పార్టీలు కూడా ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు? ఈ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పుగా ఎందుకు భావించడం లేదు? అనే సందేహాలు కలగడం సహజం.

 

అందుకు ప్రధాన కారణం రాష్ట్ర విభజన తరువాత దయనీయంగా మారిన రాష్ట్ర పరిస్థితులేనని చెప్పక తప్పదు. తెలంగాణాలో అధికారం చేప్పట్టిన తెరాసకు వడ్డించిన విస్తరి వంటి ప్రభుత్వం దక్కితే, ఆంధ్రాలో అధికారం చేప్పట్టిన తెదేపాకు కనీసం విస్తరి కూడా లేదు. రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రికే కార్యాలయం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను రాష్ట్రానికి తరలించేందుకు అవసరమయిన భవనాలను వెతుకోవలసిన దుస్థితి. ఇక ప్రభుత్వాన్ని నడిపించేందుకే నిధులు లేని పరిస్థితిలో రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి నిధుల సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. కేంద్రం నిధులు విదిలిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని దుస్థితిలో ఉన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా వ్యవసాయ రుణాల మాఫీ కోసం అధికార తెదేపా ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ సమస్యలలో ఒక్క వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తప్ప మిగిలినవి అన్నీకేవలం రాష్ట్ర ప్రభుత్వం వల్లనే తీరేవి కావని అందరికీ తెలుసు. ఇవన్నీ వందరోజుల్లో తీర్పునిచ్చే అంశాలు కావని ప్రజలకి తెలుసు. అందువలన చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీర్పు చెప్పేందుకు ఇది తగిన సమయం కాదని ప్రజలు భావిస్తునందునే ఈ నందిగామ ఉపఎన్నికలను పట్టించుకోవడం లేదని చెప్పవచ్చును. అదీగాక తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ ఆకస్మిక మృతి కారణంగా ఈ నందిగామ ఉప ఎన్నికలు జరుగుతున్నందున, ఆయన మృతి పట్ల ప్రజలు సానుభూతి చూపుతున్నారు తప్ప మిగిలిన అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.