మక్కామసీదు పేలుడు కేసు.. కాసేపట్లో తుది తీర్పు...

 

దాదాపు పదకొండు సంవత్సరాల తరువాత మక్కామసీదు పేలుడు కేసులో తీర్పు రానుంది. 11 ఏళ్ల క్రితం 2007 మే 18న మధ్యాహ్నం చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ప్రాంగణంలోని వజూఖానా వద్ద ఐఈడీ బాంబ్ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. 58 మంది గాయపడిన సంగతి తెలిసిందే. పేలుడు సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతుండటంతో 5 వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు తర్వాత జరిగిన అల్లర్లలోనూ ప్రాణనష్టం జరిగింది. అల్లర్లను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీఆలం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇది ఉగ్రవాద చర్య కావడంతో హోంశాఖ ఈ కేసును పేలుడు జరిగిన నాలుగేళ్ల తర్వాత 2011 ఏప్రిల్‌4న ఎన్‌ఐఏకి అప్పగించింది. అప్పటి నుండి విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నాంపల్లి ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు, తీర్పు వెలువరించనుంది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు వస్తున్న నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.