25 న ఫలితాలు... 27న మేయర్లు, చైర్మన్ల ఎంపిక!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది నగరపాలికలు, 120 పురపాలికలకు పోలింగ్ జరిగింది. 120 పురపాలక సంఘాల్లో 74.73 శాతం పోలింగ్ జరగగా.. 9 నగర పాలక సంస్థలో 58.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు నెలకొన్నాయి. 120 మున్సిపాలిటీలలో 2,727 వార్డులకు ఇప్పటికే 80 ఏకగ్రీవం అయ్యాయి. 2,647 వార్డులకు పోలింగ్ జరిగింది. తొమ్మిది కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. 324 డివిజన్లకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

గ్రెటర్ హైదరాబాద్ శివార్లలో కార్పొరేషన్లు , మునిసిపాల్టీల్లో ఓటింగ్ శాతం తగ్గింది. దొంగ ఓట్లు పడకుండా కొంపల్లిలో తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా వినియోగించారు ఎన్నికల అధికారులు. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు శనివారం కౌంటింగ్ జరగబోతుబడటంతో..అభ్యర్ధుల భవితవ్యం తేలుతుంది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అధికార పార్టీ విపక్షాలకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. నిజామాబాద్ లో 41 వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో టిఆర్ఎస్, బిజెపి నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఇరు పార్టీ నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 8 వ వార్డులో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరిని కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అక్కడ 60 కార్పొరేటర్ స్థానాలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. 58 డివిజన్లకు ఈ నెల 24 న పోలింగ్ జరగబోతోంది. కరీంనగర్ లో ఈ నెల 27 న ఓట్ల లెక్కింపును చేపట్టబోతున్నారు.

కాగా.. మేయర్లు, చైర్ పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం, కొత్త పాలక మండలి తొలి సమావేశం తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.