కంటతడి పెట్టిన టీఆర్‌ఎస్‌ నేత..వీడియో హల్చల్

సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి పిడమర్తి రవి, దయానంద్‌ పోటీ పడగా అధిష్టానం పిడమర్తి రవికి టికెట్‌ కేటాయించింది.దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన దయానంద్‌ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజుల పాటు ప్రదర్శనలు,ఇంటింటి ప్రచారంతో తనను బలపరచాలని స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రజల్లో తిరిగారు.ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి పిడమర్తి రవికి ఇబ్బంది కలుగుతుందన్న సమాచారంతో మంత్రులు కేటీఆర్‌, తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల దయానంద్‌ను హైదరాబాద్‌ పిలిపించి మాట్లాడారు.పార్టీలో సముచిత  స్థానం కల్పిస్తామని చెప్పటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా హామీ ఇప్పించారు.దీంతో టీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేసేందుకు దయానంద్‌ అంగీకరించారు. కానీ ఈ రాజీ వెనుక దయానంద్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని కొందరు చేసిన వ్యాఖ్యలు దయానంద్‌ను ఆవేదనకు గురిచేశాయి.ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతున్న సెల్ఫీ వీడియో ఒకటి విడుదలైంది.దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 

 

 

‘నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు.. ప్లీజ్‌ నన్ను అర్థం చేసుకోండి’.. అని వీడియోలో దయానంద్‌ పేర్కొన్నారు. 'సీటు రాకపోవడం దురదృష్టకరమని, పార్టీ కోసం కట్టుబడి పని చేయాలని, అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ పొంగులేటి చెప్పారు. కేటీఆర్‌ మాటపై పిడమర్తి రవికి మద్దతు ఇవ్వడం జరిగింది’ అని పేర్కొన్నారు. అయితే.. తాను కేటీఆర్‌  నుంచి రూ.7 కోట్లు తీసుకున్నానంటూ వదంతులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వేల కుటుంబాలకు తమ ఆసుపత్రి నుంచి ఉచితంగా వైద్యం అందించామని, విద్యార్థుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్య సేవలందించే తనపై ఇంత నిందవేసినందుకు నిజంగా తనకు బాధగా ఉందని, తానలాంటి వ్యక్తిని కాదని కన్నీరు పెట్టుకున్నారు.సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవ్వటంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయన అనుచరులు కంగుతిన్నారు.పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్‌, టీడీపీ కావాలనే అసత్య ప్రచారంచేస్తూ.. పార్టీలో కలకలం రేపాలని చూస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.