ఒకపక్క కరోనా భయం... మరోపక్క వేలాది వలస పక్షుల మృత్యువాత..

ప్రపంచం మొత్తం ఒక పక్క కరోనాతో అతలాకుతలం అవుతుండగా మరో పక్క వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పు అటు మానవాళికి ఇటు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయి. తాజాగా అమెరికాలోని న్యూ మెక్సికోలో కొన్ని వేల సంఖ్యలో వలస పక్షులు అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయి అయితే వీటి మృతికి గల కారణాలు అటు పరిశోధకులకు కూడా అంతుచిక్కకపోడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క న్యూమెక్సికోలోనే కాకుండా అరిజోనా, కొలరాడో మరియు టెక్సాస్‌ వంటి రాష్ట్రాలలో కూడా వలస పక్షులు మృతి చెందాయి.

 

ఇలా మృత్యువాత పడ్డ పక్షుల్లో బ్లాక్ బర్డ్స్, బ్లూ బర్డ్స్, ఫ్లై కాచర్స్ తో పాటు పిచ్చుకలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు పక్షుల మరణానికి గల కారణలు మాత్రం తెలియ రాలేదు. అయితే దీనికి ఇటీవల న్యూ మెక్సికోలో ఏర్పడిన కరువు పరిస్థితులు అలాగే కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు కూడా కారణమయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించిన ఎన్ఎంఎస్‌యూ శాస్త్రవేత్త మర్తా డెస్మండ్ ఇది చాలా భయంకరమైన పరిస్థితి అని.. అంతేకాకుండా ఈ ఘటన పరిధి కూడా చాలా పెద్దది.. ఇదే పద్ధతిలో మరిన్ని పక్షులు కూడా చనిపోయే అవకాశం ఉందని అయన అన్నారు. ఇప్పటికే మొన్న ఆగస్టు నెలలో తొలిసారిగా పెద్ద సంఖ్యలో పక్షులు మృతి చెందాయని యూఎస్ ఆర్మీ గుర్తించింది. అయితే అమెరికా‌లోని పలు రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొనడం రాబోయే ప్రమాదాలకు సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచంలోనే పెద్ద ఎత్తున్న జీవ వైవిధ్య అసమతుల్యతకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.