నా బంగారు తల్లి : తెలుగు సినిమారంగం సిగ్గుపడాలి!

 

ఈసారి జాతీయ సినిమా అవార్డులలో తెలుగు సినిమా ‘నా బంగారు తల్లి’ సినిమాకి తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మరో రెండు విభాగాల్లో అవార్డులు రావడం తెలుగు సినిమా రంగానికి సంతోషానిన కలిగిస్తోంది. చాలాకాలం తర్వాత జాతీయ సినిమా రంగంలో తెలుగు సినిమా ఈ స్థాయిలో వినిపించింది. ఇది తెలుగు సినిమా రంగం గర్వించదగ్గ అంశమని చాలామంది సినిమావాళ్ళు అంటున్నారు. అయితే ఈ సినిమా సాధించిన ఘనతను తెలుగు సినిమా రంగం తన అకౌంట్లో వేసుకోవడానికి ముందు సిగ్గుపడాలి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు తెలుగువాడు కాదు. రాజేష్ టచ్ రివర్ అని మలయాళ దర్శకుడు. నిర్మాతలు కూడా రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు తీసే నిర్మాతలు కాదు. మంచి సినిమా మీద ఆసక్తితో వచ్చిన వ్యక్తులే నిర్మించారు. ఈ సినిమా తీసినవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రాని విడుదల చేసే శక్తిలేక ఊరుకున్నారు. వీళ్ళు సినిమా విడుదల చేయాలంటే, సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చయిందో అంతకంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఎలా విడుదలవుతుంది. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనేక మంచి సినిమాల్లో కూడా ‘నా బంగారు తల్లి’ కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా ఇంకా కొంతకాలం విడుదల కాకుండా వుంటే, ఎన్నో వందల సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా కీర్తిశేషురాలైపోయేది. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా మన రాష్ట్రంలో రిలీజ్ కాలేక ఉత్త చిత్రంగా మిగిలిపోయేది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి కాబట్టి ఇది అర్జెంటుగా ‘మన తెలుగు సినిమా’ అయిపోయింది. ఈ సినిమా సాధించిన విజయాన్ని తన అకౌంట్లో వేసుకోవడానికి తెలుగు సినిమా రంగం రెడీ అయిపోయింది.