పెళ్లి ఖర్చులకు అడ్డుకట్ట పడనుందా!

 

ఉత్తరాదిలో ఓ సామెత ఉంది- ‘పెళ్లనేది ఓ లడ్డూలాంటిది! దానిని తిననివారేమో ఎప్పుడెప్పుడు తిందామా అని మధనపడుతూ ఉంటారు. తిన్నవారేమో ఎందుకు తిన్నామురా బాబూ అని పశ్చాత్తాపపడుతూ ఉంటారు’. పెళ్లి చేసుకున్నవారి సంగతేమో కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి మాత్రం ఇప్పుడు ఇలానే ఉంది. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లిచేయాలనే కంగారు ఎలాగూ ఉంటుంది. తీరా సంబంధం కుదిరిన తరువాత ఆ పెళ్లిని ధూంధాంగా చేసేందుకు తలప్రాణం తోకలోకి వస్తోంది.

 

ఆడపిల్లలు చదువుకోవడం, వారు కూడా సంపాదించడం, మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడంతో... వరకట్నపు సమస్య కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ వివాహపు ఖర్చులు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గార్డెన్స్లో పెళ్లి, చాట్తో సహా అన్ని రకాల వంటకాలు, డిజిటల్ ఫొటోగ్రఫీ, మండపం సెట్టింగులూ... అబ్బో ఈ జాబితా చాలా పెద్దగానే కనిపిస్తోంది. ఇవి కాకుండా సంగీత్, బారాత్, డీజే సంగీతం, వెడ్డింగ్ కేక్... అంటూ వివాహాన్ని వీలైనంత ఆడంబరంగా మార్చివేసేందుకు మనవి కాని అలవాట్లను కూడా చే(నే)ర్చుకుంటున్నారు.

 

కట్నం వద్దనే పెద్దమనుషులు కూడా ఇప్పుడు ‘పెళ్లి ఏర్పాట్లలో ఏమాత్రం లోటు లేకుండా చూడండి. అది చాలు!’ అని సింపుల్గా చెప్పేస్తున్నారు. కానీ ఆ ఒక్క కోరికనూ తీర్చేందుకు మధ్యతరగతి తండ్రులు నలిగిపోతున్నారు. మంచి సంబంధం దొరికింది కదా, పెళ్లి ఘనంగా చేసేద్దాం అనే తపనలో చేసే అప్పులతో వారి జీవితాలు వెల్లమారిపోతున్నాయి. ఆ ఒక్క రాత్రి ‘ఫలానా సుబ్బారావు తన కూతురి పెళ్లి బాగా చేశాడు,’ అనిపించుకునేందుకు వారి జీవితాన్నే పణంగా పెడుతున్నారు. ఇక ఈ పెళ్లిల్ల సందర్భంగా వందలమందికి సరిపోయే ఆహారాన్ని వృధా చేస్తున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

 

ఈ తతంగమంతా ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నాం అంటే.... బీహారుకి చెందిన రంజీత్ రంజన్ అనే ఎంపీ పెళ్లి ఖర్చులను నియంత్రించేందుకు "The Marriages (Compulsory Registration and Prevention of Wasteful Expenditure) Bill, 2016," అనే ప్రైవేటు బిల్లుని తేవడానికి ప్రయత్నిస్తున్నారు. పెళ్లికి విచ్చేసే అతిథుల సంఖ్యకీ, వారికి అందించే భోజన పదార్థాల సంఖ్యకీ ఓ పరిమితి విధించాలని రంజీత్ తన బిల్లులో కోరుతున్నారు. పెళ్లి ఖర్చు మీద కఠినమైన నియంత్రణ ఉండేలా కూడా ఈ బిల్లుని రూపొందించారు. పెళ్లి ఖర్చులు 5 లక్షలకు మించితే, అందులో పదిశాతం రాష్ట్ర సంక్షేమశాఖకు పన్నుగా కట్టాలని పేర్కొన్నారు. అలా పోగైన మొత్తంతో ప్రభుత్వం నిరుపేదల వివాహాలను జరిపించాలని సూచిస్తున్నారు. ఇక పెళ్లి జరిగిన రెండునెలలలో సదరు వివాహాన్ని రిజిస్టర్ చేయించి తీరాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. రంజీత్ భర్త పప్పు యాదవ్ అంటే బీహార్ వాసులకు అంత సదభిప్రాయం లేదు. కానీ రంజీత్ చేసిన ఈ పనికి మాత్రం దేశమంతటా హర్షిస్తోంది.

 

రంజీత్ రంజన్ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇక దీనిని పార్లమెంటు ఆమోదించడమే తరువాయి. ఒకవేళ ఈ బిల్లు కనుక సాకారం అయితే పెళ్లి ఖర్చుల మీద నియంత్రణ ఏర్పడి తీరుతుందని ఆశిస్తున్నారు. ‘ఆరుగురు అక్కచెల్లెళ్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషిగా నాకు ఆడపిల్ల పెళ్లి ఎంత ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. ప్రతిష్ట కోసం పోటీ పడి మరీ చేసే మన భారతీయ పెళ్లిళ్లలో ఉన్న ఆడంబరాన్ని గమనించబట్టే ఈ బిల్లుని తీసుకువస్తున్నాను,’ అంటున్నారు రంజీత్. రంజీత్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఆమె తెస్తున్న బిల్లులో సదుద్దేశమూ లేకపోలేదు. కానీ దీనిని పార్లమెంటు ఏమేరకు ఆమోదిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆడంబరంగా పెళ్లి చేయడంలో మన రాజకీయ నేతలకు సాటి ఎవ్వరూ రారు. జయలలిత దగ్గర నుంచీ నితిన్ గడ్కరీ వరకూ తమ ఇంట్లో పెళ్లి చేసేందుకు చూపిన ఆడంబరంతో దేశం యావత్తూ లెక్కలేనన్ని సార్లు ముక్కున వేలేసుకుంది.

 

ఇక రాజకీయ నేతలతో కుమ్మక్కయిన వ్యాపారస్తుల సంగతీ చెప్పనక్కర్లేదు. పెద్ద నోట్ల రద్దుతో దేశం మొత్తం ఏటీఎంల దగ్గర నిలబడితే గాలి జనార్ధనరెడ్డివారింట జరిగిన పెళ్లే ఇందుకు ఉదాహరణ. మరి ఇలాంటి ఆడంబరాలకు అడ్డుకట్ట పడుతుందా! కడుపు మాడ్చుకుని పైసా పైసా సంపాదించిన వారి నుంచీ, కడుపులు కొట్టి పైశాచికంగా బలపడినవారి వరకూ తమ సొమ్ములను పెళ్లిల మీద పారేసుకోకుండా ఉంటారా! వేచి చూడండి!!!