ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ప్రాణ గండం

 

టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ హత్యలకు కారణాలను పేర్కొంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో విడుదలైన ఓ లేఖ సంచలనం సృష్టించింది.గిరిజనులకు ద్రోహం చేస్తున్నందుకే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో పేర్కొన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని వెల్లడించారు.బాక్సైట్‌ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.లేఖలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు.నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలి.బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్ధతి మార్చుకోకపోతే కిడారి, సోమకు పట్టిన గతే ఆమెకు పడుతుందని లేఖలో హెచ్చరించారు.పోలీసులకు, తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, అందుకే వాళ్లు తమకు ఆయుధాలతో దొరికినా ఎలాంటి హాని తలపెట్టలేదని వివరించారు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్న పోలీసులను క్షమించి వదిలిపెట్టామని వివరించారు. కానీ, విప్లవసోదరులు దొరికితే మాత్రం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ లేఖ మావోయిస్టులు విడుదల చేసింది కాదని పోలీసు నిఘా వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.