మార్పు కోసం… ట్రిగ్గర్లే నొక్కాలా… ఈవీఎం మీటలు చాలవా?


ఛత్తీస్ గఢ్ రక్తసిక్తం అయింది. మరో మారు యువ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు! అదీ పాతిక మంది. ఇంత మందిని ఒకేసారి బలి తీసుకోవటం ఉగ్రవాదులు, పాక్ సైన్యం వల్ల కూడా కాదేమో! కాని, మన స్వంత భారతీయులైన మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు! ఇంతకీ ఎందుకు? ఇదే ఈ తరం భారతీయ యువతకి ఎంతకూ అర్థం కాని ప్రశ్న! అడవుల్లో వుండే అన్నలు, వారికి మద్దతుగా నిలిచే జనారణ్యాల్లోని మేధావులు సవివరంగా సమాధానం ఇవ్వాల్సింది కూడా ఇదే!

 

భారతదేశం స్వతంత్రం సంపాదించాక దాదాపు రెండు దశాబ్దాల అనంతరం … నక్సలిజమ్ మొదలైంది. అది 1970ల నుంచీ పెరిగి, విరిగి, మళ్లీ మొలిచి ఇవాళ్ల మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో నక్సల్స్ చంపిన రాజకీయ నేతలు, ఇన్ ఫార్మర్లు, అమాయక జనం, పోలీసులు, సైనికులు ఎందరో! నిజానికి చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాలు చేసిన భారత్ కదన రంగంలో కోల్పోయిన ప్రాణాల కంటే వామపక్ష ఉగ్రవాదం చేతిలో నిర్జీవులైన వారే ఎక్కువనిపిస్తుంది. అయితే, మావోయిస్టులు కోరేదేంటి? వారిని అవకాశం వచ్చినప్పుడల్లా కాల్చి చంపించే ప్రభుత్వాలు, పాలకులు నిరాకరించేది ఏంటి? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు లేవు. మావోయిస్టుల అంతిమ లక్ష్యం అసలు ఇప్పుడున్న వ్యవస్థనే కూల్చేయటం , మార్చేయటం అంటారు. కాని, జనం కోట్లాదిగా వచ్చి ఓట్లు వేసి తమ పాలకుల్ని ఎంచుకుంటోన్న ఈ ప్రజాస్వామ్యాన్ని కాదని చెప్పటం ఎంత వరకూ సబబు? పోనీ ఎంత వరకూ సాధ్యం?

 

పూర్తిగా వ్యవస్థని, రాజ్యాంగాన్ని మార్చేయటం లాంటి సుదూర లక్ష్యాలు పక్కన పెడితే తమ తక్షణ డిమాండ్లుగా మావోలు చెప్పేవి ఏంటి? ఆదివాసీల రక్షణ, గనులు, ఖనిజల వంటి సహజ సంపదల రక్షణ, భూ పంపీణి… ఇలాంటి అనేకం వుంటాయి. అవేవీ ప్రస్తుతం వారు అడవుల్లోంచి సాగిస్తోన్న సాయుధ పోరాటం వల్ల సాధ్యమయ్యేవి కావు. అదే గత ముప్పై, నలభై ఏళ్ల యుద్ధం నేర్పిన పాఠం! అయినా మావోయిస్టులు తమ పంథా మార్చుకోవటం లేదు.

 

మన జవాన్లు మన దేశ పౌరుల చేతుల్లోనే నిర్ధాక్షిణ్యంగా చనిపోవటం బాధాకారం. కాని, అంతకంటే బాధాకారం ఇల్లు, వాకిలి వదిలి సమాజం కోసం గన్ను పట్టిన నక్సల్స్ బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించటం. దాన్ని కూడా ఎవ్వరమూ సమర్థించలేం. కాని, ఇక్కడ సమస్యల్లా యుద్ధం ముగించటం మావోయిస్టుల చేతుల్లో వుండటంతోనే వుంది. వారు సాయుధులుగా వున్నంత కాలం రాజ్యం కూడా హింసాత్మకంగానే ఎదుర్కుంటుంది. అంతకన్నా వేరే మార్గాలు కూడా పాలకులకి వుండవు. రాజ్యాంగం ప్రజలకి ఓటు హక్కునిచ్చి ప్రతీ అయిదేళ్లకొకసారి మార్పు సాధించుకునే అవకాశం ఇచ్చినా మావోలు పట్టించుకున్నట్టు కనిపించదు. బుల్లెట్ వార్ ఆశించిన ఫలితాలు ఇప్పటికే ఇవ్వలేకపోయింది కాబట్టి బ్యాలెట్ వార్ కి దిగటం ఎంతో మేలు. దాని ద్వారా కూడా సమ సమాజ స్థాపన వీలు కాదని మావోయిస్టు మద్దతుదారులు, మేధావులు వాదిస్తుంటారు. కాని, సాయుధ పోరాటం కూడా అటుఇటుగా అర్థ శతాబ్దం కావొస్తున్నా సాధించింది ఏం లేదు. ఎన్నో అమూల్యమైన ప్రాణాలు మాత్రం సమాధి చేసింది. అందుకే, అడవుల్లోని విప్లవకారులు ట్రిగ్గర్ కన్నా ఈవీఎం మీటలు మేలేమో అలోచించుకోవాలి. వాటి ద్వారా అమాంతం ఆశించిన విప్లవం రాకున్నా ఆలస్యంగానైనా మంచి జరుగుతుంది. అంతే కాని, ఆగమ్యమైన అమానుష హింస ద్వారా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లలేరు. ఏమీ సాధించలేరు!

 

ప్రభుత్వాలు మావోయిస్టు హింస విషయంలో ఉక్కుపాదంతో అణచటమే కాకుండా మరే ఇతర మార్గాలు సత్ఫలితాలు ఇస్తాయో కూడా చూడాలి. ఎలాగైతే మావోలకు గన్ను ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదో.. అలాగే, పాలకులకి కూడా ఇవ్వబోదు. మరో కొత్త తరం సాయుధ ఆలోచనల దిశగా వెళ్లకుండా ఆపటానికి ఖచ్చితంగా తెలివైన మార్గాలు వుంటాయి. వాట్ని అన్వేషించాలి. అప్పుడే ఇవాళ్ల కాకుంటే రేపు అంతర్గత హింస నుంచి భారతదేశానికి విముక్తి లభిస్తుంది!