శశిథరూర్ "చిల్లర" వివాదం

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తమ హోదాకు తగ్గట్టు ఎంతో హుందాగా ప్రవర్తించాలి.. సరే హోదా పక్కనబెడితే తమ వయసును గమనించైనా సరే అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ సంగతి మరచిపోయినట్లున్నారు. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017వ సంవత్సరానికి గానూ మిస్ వరల్డ్ టైటిల్‌ని గెలుచుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చైనాలోని సాన్యాలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాలకు చెందిన అందగత్తెలను పక్కకునెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. అంతేకాదు 17 సంవత్సరాల తర్వాత ఈ ఘనతను మనదేశానికి అందించింది.

 

ఈ పోటీల్లో మానుషి గెలుపొందడంతో సొంత రాష్ట్రం హరియాణాతో పాటు దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతోంది. దీంతో ఛిల్లర్‌ను ఆకాశానికెత్తేసింది నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా.. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సోషల్ మీడియా ద్వారా మానుషికి అభినందనలు తెలిపారు. ఒడిషాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చిల్లర్ రూపాన్ని చిత్రించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అలా అంతా తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తున్న వేళ.. శశిధరూర్ మాత్రం ఈ ఆనందానికి రాజకీయ రంగు పులిమారు. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

"మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మన "చిల్లర"కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చిల్లర్ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది" అంటూ ట్వీట్ చేశారు. నోట్ల రద్దు విషయంలో తొలి నుంచి బీజేపీ వైఖరిని తప్పుబడుతోంది కాంగ్రెస్ . తాజా విజయాన్ని కూడా నోట్లరద్దుకి ముడిపెట్టి అవసరం లేకపోయినా మానుషి చిల్లర్ పేరును ప్రస్తావించారు థరూర్. అంతే ఆ ట్వీట్ చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో మాటల దాడి ప్రారంభమైంది. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లరగా పోల్చడంపై వారు ఫైరవుతున్నారు.

 

మానుషి జాట్ వర్గానికి చెందిన యువతి కావడంతో ఆ సామాజిక వర్గం నుంచి నిరసన సెగ మొదలైంది. ఆమెను అవమానించడం అంటే జాట్లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశప్రతిష్టను పెంచిన ఆమె ఘనతను తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ సమన్లు జారీ చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించిన థరూర్‌ వ్యూహం మిస్ ఫైర్ అయి తిరిగి ఆయన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఆయన్ని అనే కంటే కాంగ్రెస్ పార్టీని అనడం మంచిదేమో. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన మంచి కానీ, చెడు కానీ అతను ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవస్థ మొత్తానికి వర్తిస్తుంది. మరి ఈ వివాదం నుంచి ఆయన (సారీ) కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.