రైలును నెట్టిన ప్రయాణికులు

సాంకేతిక కారణాలతోనో లేక ఇతర కారణాలతో రోడ్డుపై ఆగిపోయిన బస్సు, లేదా ఇతర వాహనాలను నెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఓ రైలును ప్రయాణికులు నెట్టిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబై నుంచి లక్నో వెళుతున్న సువిధ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్న లోకోపైలెట్ రెడ్ సిగ్నల్ చూడకుండా.. రైలును ముందుకు లాగించాడు.. రైల్వే నిబంధనల ప్రకారం గ్రీన్‌సిగ్నల్ పడేవరకు పైలెట్ వేచి చూడాలి అలా కాకుండా ముందుకు వెళ్లకూడదు. అయితే ఇక్కడ ముందుకు వెళ్లిన రైలు వెనక్కి తీయడానికి అవకాశం లేదు.. ఎందుకంటే రైలు స్టేషన్ డెడ్ ఎండ్‌కు వెళ్లిపోయింది.. ఆ సమయంలో ట్రైన్ పాంటోగ్రఫ్ విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి బండి అక్కడికక్కడే నిలిచిపోయింది. సుమారు ఏడు బోగీలు రెడ్ సిగ్నల్‌ను దాటి వెళ్లిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేరే ఇంజిన్‌తో ఆగిపోయిన రైలు ఇంజిన్‌ను తోయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో సుమారు 40 మంది రైల్వే సిబ్బంది ఇంజిన్‌ను ఫ్లాట్ ఫారం దాకా నెట్టారు. ట్రైన్ తిరిగి యధాస్థానంలోకి రావడంతో ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.